వెనక్కి తగ్గని బీజేపీ రెబల్స్‌.. బరిలో 165 మంది 

22 Nov, 2019 08:22 IST|Sakshi
ఎన్నికల నేపథ్యంలో కేఆర్‌పురంలో సిబ్బందికి అవగాహన శిబిరం

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ  

జేడీఎస్‌ నుంచి ఇద్దరు నిష్క్రమణ 

పోటీలోనే ఇద్దరు బీజేపీ రెబెల్స్‌  

ఇక నుంచి ప్రచార సమరమే 

బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగిసింది. అనుకున్నట్లుగానే ఇద్దరు జేడీఎస్‌ అభ్యర్థులు తెల్లజెండా ఊపారు. ఇద్దరు బీజేపీ రెబెల్స్‌ వెనక్కి తగ్గలేదు. శివాజీనగరలో అత్యధికంగా 19 మంది పోటీలో నిలిచారు. ప్రచారం, ప్రలోభాల పర్వం మిన్నంటబోతోంది.

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న జరగనున్న ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. ఇప్పటివరకు రెబెల్స్‌ అభ్యర్థులను బుజ్జగించడం, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసిన పార్టీలు శుక్రవారం నుంచి ప్రచార బరిలో దిగనున్నారు. జేడీఎస్‌ పారీ్టకి పెద్ద షాక్‌ తగిలింది. హీరేకరూర్, అథని నియోజకవర్గాల్లో జేడీఎస్‌ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హావేరి జిల్లా హీరేకరూర్‌లో అభ్యర్థి శివలింగ శివాచార్య స్వామిజీ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అథణిలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవది జరిపిన చర్చల తర్వాత జేడీఎస్‌ అభ్యర్థి గురుదాస్యల్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక బీజేపీ రెబెల్స్‌ శరత్‌ బచ్చేగౌడ (హొసకోటె), కవిరాజ్‌ అరస్‌ (హొసపేటె)లు వైదొలగకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.  చివరకు 15 స్థానాలకు 165 మంది రంగంలో మిగిలారు. 


నేటి నుంచి దూకుడు  
శుక్రవారం నుంచి సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందా గౌడ, సురేశ్‌ అంగడి, ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌కటీల్‌లు ప్రచారంలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి సిద్ధరామయ్య, జేడీఎస్‌ నుంచి కుమారస్వామిలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. దేవెగౌడ కూడా నేటి నుంచి ప్రచారం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు ఎంతో కీలకమైన ఈ ఎన్నికలను బీజేపీ, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని  కదనరంగంలోకి దిగాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనే బీజేపీ ఆరాటం అయితే అనర్హత ఎమ్మెల్యేలను ఓడించడంతో  పాటు ప్రభుత్వాన్ని కూలదోల్చడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రణాళికలు రచిస్తున్నాయి.  

శివాజీనగరలో 19 మంది పోటీ: సీఈవో  
మొత్తం 15 నియోజకవర్గాల్లో 37,77,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. నామినేషన్లు ముగిసే నాటికి మొత్తం 165 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం మొత్తం 53 మంది ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా శివాజీనగరలో 19 మంది, అత్యల్పంగా కేఆర్‌ పేట, యల్లాపుర ఏడుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుండగా, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సన్నాహాలను చేపట్టింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై సిబ్బందికి అవగాహన తరగతులను గురువారం బెంగళూరు కేఆర్‌ పురంలో ప్రారంభించింది.  

మరిన్ని వార్తలు