మిగిలింది రెండు రోజులే! 

22 Mar, 2019 01:11 IST|Sakshi

సెలవులు పోగా నామినేషన్ల స్వీకరణకు రెండు రోజులే 

ఇంకా నామినేషన్లు వేయని ప్రధాన పార్టీల అభ్యర్థులు 

17 లోక్‌సభ స్థానాలకు గత 4 రోజుల్లో 58 నామినేషన్లు దాఖలు 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటివరకు 58 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కొంత మందే ఉన్నారు. హైదరాబాద్‌ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం), కరీంనగర్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌) నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల కీలక అభ్యర్థులు ఇంకా నామినేషన్లు దాఖలు చేయలేదు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు బీజేపీ, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం చేయడమే ఇందుకు కారణం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ 16 మంది అభ్యర్థులను ప్రకటించగా, ఇప్పటివరకు కొంత మంది మాత్రమే నామినేషన్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి టీడీపీ పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొని ఉంది. ఈ అంశంపై టీడీపీ నాయకత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.  

22, 25 తేదీల్లోనే నామినేషన్లు.. 
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25తో ముగియబోతోంది. 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవులు పోగా, నామినేషన్ల స్వీకరణకు రెండు పని దినాలు మాత్రమే మిగిలాయి. అంటే ఈ నెల 22, 25 తేదీల్లో మాత్రమే నామినేషన్ల స్వీకరణ జరగనుంది. టీఆర్‌ఎస్‌ గురువారం అభ్యర్థులను ప్రకటించడంతో సస్పెన్స్‌ వీడింది. శుక్ర, సోమవారాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు