రేపే ఆఖరు.. పార్టీలకు ఫీవర్‌

23 Apr, 2018 09:22 IST|Sakshi

24తో నామినేషన్ల పర్వం సమాప్తం

బీజేపీ, జేడీఎస్‌ల తుదిజాబితా పెండింగ్‌

ఆశావహుల్లో టెన్షన్‌

సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు మరోరెండు రోజుల్లో గడువు ముగియనుంది. ఇప్పటికే కాంగ్రెస్‌ మొత్తం 224 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా, జేడీఎస్‌ ఇంకా తుది జాబితా కసరత్తులోనుంది. కాంగ్రెస్, బీజేపీలలో భంగపడ్డ వారు జేడీఎస్‌ వైపు చూస్తున్నారు. కాగా బీజేపీ ఇంకా 11 స్థానాలకు, జేడీఎస్‌ 38 స్థానాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. సొంత పార్టీలో టికెట్లు దక్కని వారు వేరే పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైననాయకులు ఎక్కడ జారిపోతారోనని అన్ని పార్టీల్లో టెన్షన్‌ నెలకొంది.

స్వతంత్రులుగా అసంతృప్తులు
పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్, బీజేపీలు టికెట్లు  ఇవ్వలేదు. దీంతో వారు తిరుగుబాటుదారులుగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. కల్బుర్గి నుంచి బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి రేవునాయక్‌ బెళమగి జేడీఎస్‌ నాయకులతో సంప్రదిస్తున్నారు. జేడీఎస్‌లో టికెల్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారని సమాచారం. మంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించిన కృష్ణ పాలిమర్‌ స్వతంత్రునిగా పోటీకి సై అంటుననారు. బీజేపీ ఆ స్థానం నుంచి డాక్టర్‌ భరత్‌శెట్టికి టికెట్‌ ఇస్తోంది. కొడగు జిల్లా విరాజపేట నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ పద్మిని పొన్నప్ప ఇప్పటికే జేడీఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రెండో నియోజకవర్గమైన బాదామి నుంచి మంగళవారం నామినేషన్‌ వేస్తారు. 

మరిన్ని వార్తలు