ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు

6 Sep, 2018 03:46 IST|Sakshi

నేటి నుంచి శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం 

నేడు వాజ్‌పేయికి, రేపు హరికృష్ణకు అసెంబ్లీ నివాళి

ఇవే పూర్తిస్థాయి చివరి సమావేశాలు కావచ్చన్న స్పీకర్‌ కోడెల

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తేనే సభకు హాజరవుతామన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు 

సాక్షి, అమరావతి: ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేకుండానే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. తమ పార్టీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా గత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నుంచి వెఎస్సార్‌సీపీ సభ్యులు సభకు హాజరుకాని విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అన్హరత వేటు వేస్తే.. ఆ వెంటనే అసెంబ్లీకి హాజరవుతామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బుధవారం ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్యలు తీసుకోనందున గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రెండోసారి ప్రధాన ప్రతిపక్షం లేకండానే ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. 

ఉదయం 8.30 గంటలకు బీఏసీ భేటీ 
గురువారం ఉదయం 9.15 గంటలకు శాసన సభ సమావేశాలు, 9.45 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు ఉదయం 8.30 గంటలకు శాసనసభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశమై ఎప్పటి వరకు సమావేశాలు నిర్వహించాలో నిర్ణయించనుంది. మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి మృతికి గురువారం ఉభయ సభల్లో నివాళులు అర్పించనున్నారు. మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి పట్ల శుక్రవారం నివాళులు అర్పిస్తారు. 

పటిష్ట బందోబస్తు 
అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు, భద్రతా సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాని స్పీకర్‌ కోడెల స్పష్టం చేశారు. అసెంబ్లీ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, గట్టి నిఘా పెట్టాలని సూచించారు. విజిటర్స్‌ గ్యాలరీపైనా కన్నేసి ఉంచాలన్నారు. విజిటర్లకు ఇచ్చే పాస్‌లను క్షుణ్నంగా పరిశీలించాకే లోపలికి అనుమతించాలని స్పీకర్‌ ఆదేశించారు.  

సభ్యుల ప్రశ్నలకు సమాధానాలేవీ?
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ కలిసి బుధవారం బందోబస్తు ఏర్పాట్లు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. ఇవే చివరి పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలు కావొచ్చని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు ఇచ్చిన సమాధానాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలకు తావివ్వరాదని అధికారులకు సూచించారు. అత్యధికంగా రెవెన్యూ, విద్య, వైద్యం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, పురపాలక శాఖల్లో ప్రశ్నలకు సమాధానాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మండలి చైర్మన్‌ ఫరూక్‌ మాట్లాడుతూ.. ఇంతవరకూ జరిగిన 11 సెషన్లకుగాను 792 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు