'వారికి రజనీకాంత్‌కు సంబంధం లేదు'

6 Jan, 2018 16:31 IST|Sakshi

సాక్షి, చెన్నై : రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం ప్రకటనతో తమిళనాడులో రాజకీయం రసకందాయంగా ఉంది. ఈమేరకు రజనీ పార్టీ తరపున చాలామంది నేతలు పలు టీవీ ఛానెల్లలో కూర్చొని గంటలకొద్ది డిబేట్లు నిర్వహిస్తున్నారు. అయితే వాటిపై రజనీకాంత్‌ అభిమానుల అసోషియేషన్‌ ఓ కీలక ప్రకటన చేసింది. పార్టీ తరపున ఏ ఒక్కరిని అధికార ప్రతినిధిగా గుర్తించలేదని పేర్కొంది. రజనీ కొత్తపార్టీని స్వయంగా ప్రకటించిన తర్వాతనే అన్ని విషయాలు వెల్లడిస్తామని అభిమానుల అసోసియేషన్‌ అధ్యక్షుడు, వీఎం సుధాకర్‌ తెలిపారు.

ఇప్పటి వరకూ టీవీ డిబేట్లు, పత్రికా సమావేశాల్లో రజనీ పార్టీ గురించి మాట్లాడినవి, వారి స్వంత అభిప్రాయాలుగా గుర్తించాలన్నారు. వారి వక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలకు ముడిపెట్టొద్దని సుధాకర్‌ సూచించారు. పార్టీ తరపున కానీ, అభిమాన సంఘాల తరపున ఏఒక్కరినీ పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తించలేదని ఆయన అన్నారు. రజనీకాంత్‌కు టీవీ డిబేట్లు, పత్రికా సమావేశాల్లో మాట్లాడేవారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. గత డిసెంబర్‌ 31 రజనీ కొత్తపార్టీని పెడతానని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోకవర్గాల్లో పోటీచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు