టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం

22 Jul, 2019 10:37 IST|Sakshi

భోపాల్‌: వివాదాస్పద బీజేపీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. అయితే ఈసారి విపక్షనేతలపై కాకుండా తన సొంత నియోజకవర్గ పార్టీ కార్యకర్తలపైనే. వర్షాకాలం కావడంతో.. సాద్వీ ప్రాతినిథ్యం వహిస్తున్న భోపాల్‌ పరిసర ప్రాంతాల్లో అపరిశ్రుభంగా మారాయి. అయితే ఆ ప్రాంత డ్రైనేజీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. తమ ప్రాంతంలో ఓసారి స్వచ్ఛభారత్‌​ చేపట్టండని ఆమెకి విజ్ఞప్తి చేశారు. దీంతో వారిపై ప్రజ్ఞా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ డ్రైనేజీలు శుభ్రం చేయడానికి ఎన్నికకాలేదని ఘాటుగా సమాధానమిచ్చారు. ‘మీ మురికివాడలను శుభ్రం చేయడానికి నేనేం పారిశుధ్య కార్మికురాలిని కాదు. డ్రైనేజీ, టాయిలెట్లను పరిశుభ్రం చేయడానికి కాదు నేను పార్లమెంట్‌కు ఎన్నికయింది. నేను స్థానిక ప్రజాప్రతినిధులను సమస్వయం చేసి పని చేయచేయిస్తాను’ అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ అధికారులకు, కార్మికులకు, స్థానిక ఎమ్మెల్యేలకు తాను కేవలం ఆదేశాలు జారీ చేస్తానని, వారితో పనిచేయించుకోండని ప్రజ్ఞా ఉచిత సలహా ఇచ్చారు. ఎంపీ సమాధానంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌ అంటూ.. గంటల కొద్ది ప్రసంగాలు ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. దీనిలో ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర్ర ప్రభుత్వాలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చినా అది ఏమాత్రం అమలుకావడంలేదు. ప్రజ్ఞా సమాధానంపై స్థానిక కాంగ్రెస్‌ నేత తారీక్‌ అన్వర్‌ తీవ్రంగా స్పందించారు. ఇది ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. దీనిపై ప్రధాని మోదీ వెంటనే కల్పించుకుని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.​

​కాగా వివాదాస్పద నేతగా పేరొందిన సాద్వీ ప్రజ్ఞా.. ఎన్నికల సమయంలో ఎన్నోసార్లు నోరుజారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 2008 మాలెగావ్‌ పేలుళ్ల కేసులో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు