కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నేరం అవుతుంది: యడ్యూరప్ప

13 Jan, 2018 18:48 IST|Sakshi

'సాక్షి, కోలారు : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది నేరం అవుతుంది.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రజల విశ్వాసం కోల్పోయారు.. గత ఐదేళ్లుగా ప్రజలను వంచించింది మినహాయిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. శ్రీనివాసపురం పట్టణంలో పరివర్తన యాత్రలో భాగంగా శనివారం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎత్తినహొళె పథకంలో యంత్ర పరికరాలను, పైప్‌లైన్‌లను కొనుగోలు చేసి కమీషన్‌లు దండుకున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రులు ప్రజలను మోసం చేసి మభ్యపెడుతున్నారని, ఈ పథకాన్ని పూర్తిగా మూలన పడేశారని అన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రమేష్‌కుమార్‌ సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో సౌలభ్యాలు కరవయ్యాయన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో మామిడి అభివృద్ధి మండలికి నిధులు మంజూరు చేస్తే వాటిని సక్రమంగా ఖర్చు చేయడంలో ఇప్పటి సీఎం పూర్తిగా విఫలమయ్యారన్నారు. దేశంలో ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, కర్నాటకలో కూడా పుట్టగతులుండవని యడ్యూరప్ప హెచ్చరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, ఆర్‌.అశోక్, లోక్‌సభ సభ్యుడు పి.సి.మోహన్, కేజీఎఫ్‌ ఎమ్మెల్యే వై.రామక్క, హెబ్బాళ ఎమ్మెల్యే వై.ఎ.నారాయణస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి.పి.వెంకటమునియప్ప, మాజీ ఎమ్మెల్యేలు వై సంపంగి, ఎం.నారాయణస్వామి పాల్గొన్నారు. 

                                         
 

మరిన్ని వార్తలు