అప్పట్లో ‘నోటా’దే అత్యధికం

31 Mar, 2019 12:35 IST|Sakshi

సాక్షి, భైంసా : ‘నోటా’... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరు కూడా నచ్చకుంటే ఓటరు నిరభ్యంతరంగా తన వ్యతిరేకతను తెలిపేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఏర్పాటే నోటా. అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటరు ఈవీఎంలో ఈ ‘నోటా’ బటన్‌ నొక్కి తన తీర్పునివ్వొచ్చు. ఇంత ప్రాధాన్యమున్న ‘నోటా’ మీటతో ఆదిలాబాద్‌ జిల్లాకు ప్రత్యేక సంబంధం ఉంది.

ఎలాగంటే.. 2014లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో నోటా ఓట్లు 17,041 వచ్చాయి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలోనే నోటా ఓట్లు అత్యధికంగా రావడం ఓ సంచలనంగా మారింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 10,47,024 ఓట్లు పోలవగా, నోటాకు 17041 ఓట్లు వచ్చాయి.

అవగాహన లేకపోవడం వల్లే!
విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలు, నాయకుల నేరచరిత్ర, అభ్యర్థుల గుణగణాలపై అవగాహన ఉండి ప్రశ్నిస్తారు. అంటే, మేధావి వర్గమే ఎన్నికల్లో నోటా వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, 2014 ఎన్నికల్లో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు రావడం కేవలం ఓటర్ల అవగాహనరాహిత్యం వల్లే కావొచ్చని భావించారు.

ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానంలో షెడ్యూల్‌ తెగలు, సామాజికవర్గానికి కేటాయించిన ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోనూ నోటా ఓట్లు అధికంగా నమోదయ్యాయి. రాజకీయచైతన్యం, అక్షరాస్యత అంతగాలేని గిరిజనులు అవగాహన లేమితో నోటా బటన్‌ నొక్కి ఉంటారని నిపుణులు నాడు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు