అతిపెద్ద కుంభకోణం

31 Aug, 2018 03:26 IST|Sakshi
ఢిల్లీలో రాహుల్‌తో కుమారస్వామి

పెద్ద నోట్ల రద్దుపై రాహుల్‌గాంధీ విమర్శ

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) నివేదిక విడుదల చేసిన వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గురువారం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు డబ్బులు సమకూర్చేందుకే సామాన్యులపై మోదీ నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారని విమర్శించారు. 

‘పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లకుండాపోయిన నగదంతా బ్యాంకులకు తిరిగివచ్చేసింది. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువకాదు’ అని వ్యాఖ్యానించారు. ‘దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలైన ఆయన మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నోట్ల రద్దుతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారు.గత ఎన్నికల్లో ప్రచారానికి భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన పారిశ్రామికవేత్తలకు సాయం చేయడమే ఆయన లక్ష్యం’ అని రాహుల్‌ మండిపడ్డారు.

బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న గుజరాత్‌లోని ఓ సహకార బ్యాంకులో ఏకంగా రూ.700 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొందరు మార్చుకోవడంపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ‘గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకులో ఎవరి నగదు మార్పిడి జరిగిందో విచారణ జరిపారా? అని ప్రశ్నించారు. రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ఆర్థికమంత్రి జైట్లీకి తాము పెట్టిన డెడ్‌లైన్‌ గడువు ముగుస్తోందన్నారు.

రాహుల్‌తో కుమారస్వామి భేటీ
కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాహుల్‌గాంధీని కర్ణాటక సీఎం కుమారస్వామి   ఢిల్లీలో కలిశారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై త్వరలో∙నిర్ణయం తీసుకుంటామని అనంతరం కుమారస్వామి మీడియాతో అన్నారు.

మరిన్ని వార్తలు