మూక హత్య బాధాకరం

27 Jun, 2019 03:57 IST|Sakshi

జార్ఖండ్‌ ఘటనపై రాజ్యసభలో మోదీ

ధన్యవాద తీర్మానంపై చర్చకు బదులిచ్చిన ప్రధాని

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఇటీవల ఒక ముస్లిం యువకుడు మూక హత్యకు గురి కావడం తననెంతో బాధించిందని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ అన్నారు. జార్ఖండ్‌ అయినా, బెంగాల్‌ అయినా, కేరళ అయినా దేశంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా అన్నింటినీ ఒకేలా చూడాలని, చట్టం తన పని తాను చేయాలని ఉద్ఘాటించారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ జార్ఖండ్‌ ఘటనపై స్పందించారు.

బీజేపీ పాలిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో జరిగిన మూక హత్యపై మోదీ స్పందించడం లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన బదులిస్తూ దేశంలో ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడం తమ రాజ్యాంగ విధి అన్నారు.రాజ్యసభ సభ్యులు కొందరు జార్ఖండ్‌ మూక హత్యల కేంద్రమని అనడాన్ని ప్రస్తావిస్తూ ‘అలా ఒక రాష్ట్రాన్ని అవమానించడం సరైనదేనా అని ప్రధాని ప్రశ్నించారు.  మోటారు సైకిలు దొంగిలించాడన్న ఆరోపణతో జార్ఖండ్‌లో ఇటీవల 24 ఏళ్ల ముస్లిం యువకుడిని కొందరు చావబాదడం, అతనిచేత బలవంతంగా జైశ్రీరాం నినాదాలు చేయించడం తెలిసిందే.

బిహార్‌లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో ఒకే నెలలో 130 మంది పిల్లలు చనిపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో సంవత్సరాలయిన తర్వాత కూడా అలాంటి వ్యాధి ఇప్పటికీ ప్రజల్ని చంపుతుండటం ఏడు దశాబ్దాల పాలనలో ఘోర వైఫల్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటమిని అంగీకరించలేకపోవడం, ఈవీఎంలను సందేహించడం ద్వారా ప్రజా తీర్పును కించపరచడం కాంగ్రెస్‌ అహంకారానికి నిదర్శనమన్నారు.  16వ లోక్‌సభ కాలం ముగియడానికి ముందు రాజ్యసభ ఆమోదం పొందని కారణంగా 22 బిల్లులు చెల్లకుండా పోయాయని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు సర్దార్‌వల్లభ్‌భాయ్‌ పటేల్‌ మొదటి ప్రధాని అయి ఉంటే కశ్మీర్‌ సమస్య తలెత్తేదేకాదని తమ పార్టీ నమ్మకమన్నారు.

ధన్యవాద తీర్మానం ఆమోదం
ప్రధాని ప్రసంగం తర్వాత సభ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని లోక్‌సభ మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే.ఈ తీర్మానంపై ఉభయ సభల్లోనూ 13 గంటల పాటు చర్చ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన 50 మంది చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఈ తీర్మానానికి 200 సవరణలు ప్రతిపాదించింది. అయితే, తర్వాత వాటిని ఉపసంహరించుకుంది.

మరిన్ని వార్తలు