‘టీఆర్‌ఎస్‌ నేతలను రోడ్లపై తిరగనివ్వం’

3 May, 2019 08:18 IST|Sakshi
గాంధీభవన్‌ వద్ద దీక్షలో అనిల్‌కుమార్‌యాదవ్, రేవంత్‌రెడ్డి, బల్మూరి వెంకట్‌ తదితరులు

ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల

48 గంటలదీక్ష ప్రారంభం

ఇంటర్‌ ఫలితాల తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

దీక్షను ప్రారంభించిన కోదండరెడ్డి.. రేవంత్‌రెడ్డి హాజరు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ), యువజన కాం గ్రెస్‌ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లతోపాటు పలువురు నేతలు గాంధీభవన్‌ వేదికగా దీక్షకు కూర్చున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌చైర్మన్‌ కోదండరెడ్డి ఈ దీక్షను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు  విశ్రమించబోమన్నారు. ప్రభు త్వం ఆందోళనలు జరగకుండా నిర్బంధాలు విధిస్తోందని విమర్శించారు.

విద్యార్థుల చావుల కోసమేనా?: వెంకట్‌
ఇంటర్‌బోర్డు చేసిన తప్పులపై ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఎన్‌ఎస్‌ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ ఆరోపించారు. విద్యార్థుల చావుల కోసమే తెలంగాణ సాధించుకున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌ ఫలితాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేయకపోతే టీఆర్‌ఎస్‌ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించా రు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ మాట్లాడుతూ ఉన్నతశిఖరాలను అధిరోహించాలనుకునే విద్యార్థుల కలలు కల్లలయ్యేం దుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. దీక్షకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సతీశ్‌ మాదిగ సంఘీభావం తెలిపారు.  

దొంగల చేతికే తాళం ఇస్తారా: రేవంత్‌ 
ఇంటర్‌ బోర్డు ఫలితాల్లో తప్పు చేసిన గ్లోబరీనా సంస్థకే మళ్లీ రీవెరిఫికేషన్‌ బాధ్యతలు ఇవ్వడం దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ  ఇంటర్‌ బోర్డులో అక్రమాలు జరిగాయని నిరూపిం చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్‌ చెప్పారు.    

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు