ఎన్టీఆర్‌ ప్రభంజనం!

30 Oct, 2018 02:38 IST|Sakshi

202 సీట్లలో ప్రాంతీయ పార్టీ టీడీపీ ఘన విజయం

కాంగ్రెస్‌ వ్యతిరేక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ ర్యాలీలు

ఆంధ్రలో కాంగ్రెస్‌కు ఝలక్‌..తెలంగాణలో దక్కిన పరువు

చంద్రగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓడిన చంద్రబాబు  

1983 
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు జాతీయ రాజకీయాల్లోనూ చరిత్రాత్మకంగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించినప్పటినుంచి అప్రతిహతంగా 26 ఏళ్ల పాటు ఎదురులేకుండా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌కు తెలుగుగడ్డపై నందమూరి తారక రామారావు బ్రేకులు వేశారు. కాంగ్రెస్‌ వ్యతిరేక నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించారు. ఆ తర్వాత కేవలం 9 నెలల వ్యవధిలో.. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభంజనం సృష్టించారు. 294 స్థానాల్లో 202 సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 60 సీట్లకే పరిమితం కాగా.. ఇందులో తెలంగాణలోనే 42 (107 సీట్లలో) స్థానాలు సంపాదించుకుంది. కాంగ్రెస్‌ హేమాహేమీలు.. సైకిల్‌ గుర్తుపై పోటీచేసిన అనామకుల చేతుల్లో దారుణంగా ఓడిపోయారు. ఎన్టీఆర్‌తో పొత్తుకోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన ఉభయ కమ్యూనిస్టులు, జనతాపార్టీ, లోక్‌దళ్, బీజేపీ పార్టీలు కూడా తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. 1982లో ఇందిరతో విభేదించి సొంతపార్టీ (రాష్ట్రీయ సంజయ్‌ మంచ్‌) పెట్టుకున్న చిన్న కోడలు మేనకా గాంధీ ఎన్టీఆర్‌తో చేతులు కలిపారు.  

శూన్యత పూరించిన ఎన్టీఆర్‌ 
ఏపీ అవతరణ తర్వాత కాంగ్రెస్‌ కాస్తో, కూస్తో పోటీగా భావించిన కామ్రేడ్లు 1957, 62 ఎన్నికల్లో మినహా గట్టిపోటీని ఇవ్వలేకపోయారు. మిగిలిన జాతీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగుగడ్డపై ఏర్పడిన రాజకీయ శూన్యతను ఎన్టీఆర్‌ పూరించారు. 1978లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ (ఐ)లో మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో ఈ సంఖ్య 250 దాటింది. అయినా ఆ పార్టీ సుస్థిర పాలనను అందించలేకపోయింది. అవినీతి, అసమ్మతి, అంతర్గత పోరుతో కాంగ్రెస్‌ ప్రజాదరణ కోల్పోయింది. అప్పటికే హైదరాబాద్‌లో స్థిరపడిన ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే.. టీడీపీ తొలి ర్యాలీకి జనం పెద్దగా హాజరుకాలేదు. కానీ.. చైతన్యరథం ద్వారా ఎన్టీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో ఆ పార్టీకి జనాదరణ మొదలైంది. ఆర్నెల్లలోపే ఈ గాలి ప్రభంజనంగా మారుతున్నట్లు కనిపించడంతో ఇందిర అసెంబ్లీని మూడునెలల ముందే రద్దుచేసి ఎన్నికలు జరిపించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేనాటికి.. ఎన్టీఆర్‌ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటన పూర్తిచేయలేదు. దీంతో కోస్తా, రాయలసీమతో పోలిస్తే తెలంగాణలో టీడీపీకి తక్కువసీట్లు వచ్చాయి. గతంలో కాంగ్రెస్‌ మంత్రులుగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వసంత నాగేశ్వరరావు, ఎన్‌.యతిరాజారావు, పి.మహేంద్రనాథ్, టీఎన్‌ సదాలక్ష్మి వంటి నేతలు తెలుగుదేశంలో చేరారు. అంతేగాక, అసలు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని వారు కూడా టీడీపీలో చేరి విజయం సాధించారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతోపాటు రెండు రూపాయలకే కిలో రేషన్‌ బియ్యం, బడుగు వర్గాల సంక్షేమానికి చేసిన హామీలు ఎన్టీఆర్‌ ప్రభంజనానికి కారణాలు.

కుదేలైన కాంగ్రెస్‌! 
కేవలం సినీ గ్లామర్‌తో ఎన్టీఆర్‌ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేరని.. కాంగ్రెస్‌ నేతలు వేసిన అంచనాలు తప్పయ్యాయి. ఇందిరతోపాటు, రాజీవ్‌ గాంధీ స్వయంగా ప్రచారం చేసినా ఎన్టీఆర్‌ జోరు ముందు పనిచేయలేదు. సొంత జిల్లా కృష్ణాలోని గుడివాడ, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్‌ రెండు చోట్లా ఘనవిజయం సాధించారు. చంద్రగిరి నుంచి రెండోసారి కాంగ్రెస్‌ టికెట్‌  తీసుకొని పోటీచేసిన ఆయన అల్లుడు, సహాయ మంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తెలుగుదేశం 149 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50%కు పైగా ఓట్లు సంపాదించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి 46.3% ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో అప్పటివరకు రెండు సీట్లకే పరిమితమైన ఎంఐఎం.. ఈసారి తన సంఖ్యను ఐదుకు పెంచుకుంది.

కాంగ్రెస్‌ పరువు కాపాడిన తెలంగాణ 
కాంగ్రెస్‌ గెలిచిన 60 సీట్లలో అత్యధికంగా 42 స్థానాలు తెలంగాణ ప్రాంతంలోనే దక్కాయి. తెలుగుదేశం పార్టీకి కూడా బలహీనంగా ఉందనుకున్న తెలంగాణలోని మొత్తం 107 సీట్లలో 42 సీట్లు కైవసం కావడం విశేషం. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రప్రాంత సెటిలర్లు గణనీయ సంఖ్యలో ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో టీడీపీ అత్యధిక సీట్లు (6/9) గెలుచుకోగలిగింది. అలాగే పూర్వపు ఆంధ్రరాష్ట్ర జిల్లాల మూలాలున్న జనం చెప్పుకోదగ్గ సంఖ్యలో నివసించే హైదరాబాద్‌ నగరంలో కూడా తెలుగు దేశం పార్టీకి ఎక్కువ సీట్లు కైవసమయ్యాయి. ఇక్కడ ఏడు సీట్లు (హిమాయత్‌నగర్, ముషీరాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌) టీడీపీ గెలుచుకుంది. ఇంకా జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్‌లో 6/13, మెదక్‌లో 3/10, ఆదిలాబాద్‌లో 4/9, కరీంనగర్‌లో 6/13, వరంగల్‌లో 4/13, నల్లగొండలో 4/12, ఖమ్మంలో 1/9 స్థానాల్లో ఎన్టీఆర్‌ పార్టీ విజయం సాధించింది.

బరిలో తొలిసారి...
సిద్ధిపేట నుంచి టీడీపీ తరఫున పోటీచేసిన కేసీఆర్‌.. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మదన్‌మోహన్‌ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ రద్దు కారణంగా రెండేళ్లకే జరిగిన మధ్యంతర ఎన్నికల్లో (1985) సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి టి.మహేందర్‌రెడ్డిపై 16 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కేసీఆర్‌ గెలుపొందారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ మంత్రి కె.కేశవరావును తెలుగుదేశం అభ్యర్థి మాచినేని కిషన్‌రావు ఓడించారు. కార్మిక నేత, జనతాపార్టీ అభ్యర్థి నాయిని నరసింహారెడ్డి తెలుగుదేశం అభ్యర్థి శ్రీపతి రాజేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. మాజీ హోంమంత్రి కె.ప్రభాకరరెడ్డిని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్‌పేటలో ఓడించారు. చాంద్రాయణగుట్ట నుంచి పోటీచేసిన బీజేపీ నేత ఆలె నరేంద్రను ఎంఐఎం నేత అమానుల్లా ఖాన్‌ ఓడించారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ నేత జువ్వాడి రత్నాకరరావును.. టీడీపీ అభ్యర్థి టి.జీవన్‌ రెడ్డి ఓడించారు. 

తొలిసారి ఈవీఎంలు
ఈవీఎంలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన షాద్‌నగర్‌లో తొలిసారి పోటీచేసిన కాకా అల్లుడు శంకరరావు గెలుపొందారు. డీకే సమర సింహారెడ్డి(కాంగ్రెస్‌) గద్వాల నుంచి, మంత్రి ఎం.మాణిక్‌రావు తాండూరులో గెలిచారు.చార్మినార్‌ నుంచి ఎంఐఎం నేత సలావుద్దీన్‌ ఒవైసీ అసెంబ్లీకి చివరిసారి పోటీచేసి బీజేపీ అభ్యర్థి సి.అశోక్‌కుమార్‌ను ఓడించారు. మాజీ సీఎం అంజయ్య(రామాయంపేట), సీపీఐ నేత గూండా మల్లేష్‌ (ఆసిఫాబాద్‌), దుద్దిళ్ల శ్రీపాదరావు (మంథని) నుంచి గెలిచారు.అచ్చంపేటలో టీడీపీ టికెట్‌పై పోటీచేసిన పి.మహేంద్రనాథ్‌ విజయం సాధించారు. 

మెదక్‌ నుంచి గెలిచిన ఇందిర 
కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వ పతనం తర్వాత 1980లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ) ఘన విజయం సాధించింది. మొత్తం 42 ఎంపీ స్థానాల్లో 41 సీట్లను (పార్వతీపురం–ఎస్టీ) నుంచి గెలుపొందిన కిశోర్‌ చంద్రదేవ్‌ (కాంగ్రెస్‌ అర్స్‌–యూ) మినహా ఇందిరా కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుని పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లో మెదక్‌ నుంచి మాజీ ప్రధాని ఇందిర 2,19,124 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.  

తెలంగాణ నుంచి గెలిచిన ఇతర ప్రముఖులు 
గెలిచిన ముఖ్యనేతల్లో మాజీ సీఎం పీవీ నరసింహారావు (హన్మకొండ), పి.శివశంకర్‌ (సికింద్రాబాద్‌), ఎం. మల్లిఖార్జున్‌ (పాలమూరు), మల్లు అనంతరాములు (నాగర్‌కర్నూల్‌–ఎస్సీ), కమాలుద్దీన్‌ అహ్మద్‌ (వరంగల్‌), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్‌), నంది ఎల్లయ్య (సిద్దిపేట–ఎస్సీ), కోదాటి రాజమల్లు (పెద్దపల్లి–ఎస్సీ), కె.సత్యనారాయణ (హైదరాబాద్‌) ఉన్నారు. 
-(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)  

మరిన్ని వార్తలు