‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’

24 May, 2019 20:20 IST|Sakshi

సేఫ్‌గా బయటపడ్డ ఎంపీలు కింజారపు, గల్లా

సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు చేసిన పొరపాట్లు పోటీ చేసిన అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి. కీలక స్థానాల్లో నిబంధనలు పాటించకపోవడంతో ఫలితాలు తారుమారై ఓటమి పాలయ్యారు.  ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పోస్టల్‌, సర్వీస్‌ ఓట్లు చెల్లకుండా పోవడం అభ్యర్ధుల్ని ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో  ఓటమి అంచుల వరకూ వెళ్లిన కొందరు అధికార పార్టీ సిట్టింగులు... ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి బయటపడ్డారు.  

హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో  పోస్టల్‌, సర్వీస్‌ ఓట్లు కీలకంగా మారాయి. మూడు లక్షల అయిదువేల పోస్టల్ బ్యాలెట్లు, అరవైవేల సర్వీస్‌ ఓట్లను జారీ చేశారు. వీటిలో 2లక్షల 20వేల ఓట్లు... పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం12  పూర్తి చేయడంలో చేసిన పొరపాట్లుతో చెల్లకుండాపోయాయి. కొన్ని చోట్ల నిబంధనల మేరకు వాటిని  సంరక్షించకపోవడం కూడా వివాదాస్పదమైంది. 

అలాగే కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు ఆ బ్యాలెట్‌ పేపర్‌ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్‌ బ్యాలెట్‌ పంపే కవర్‌ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో  చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు ఓటమి బారి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. 6,653 ఓట్ల తేడాతో కింజారపు గెలిచారు. అలాగే గుంటూరు నుంచి గల్లా జయదేవ్‌ కూడా ఇలాగే సేఫ్‌ అయ్యారు. గుంటూరు పార్లమెంటు నియోజక వర్గంలోనూ భారీగా పోస్టల్‌ బ్యాలెట్‌లు చెల్లకుండా పోయాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై 4205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్‌ గెలిచారు. పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. 

మరిన్ని వార్తలు