‘యూబీఐ’ అంటే ఏమిటీ? భారత్‌లో అది సాధ్యమా?

28 Mar, 2019 17:47 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ (యూబీఐ) దీన్ని తెలుగులో ‘సార్వత్రిక కనీస ఆదాయం’గా పేర్కొనవచ్చు. భారత్‌ లాంటి దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, ధనిక–పేదల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి సార్వత్రిక కనీస ఆదాయం స్కీమ్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్న అర్వింద్‌ సుబ్రమణియన్‌ 2016–2017 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన ఆర్థిక సర్వే నివేదికలో చెప్పారు. ఆయన ఈ అంశానికి ఏకంగా ఓ అధ్యాయాన్నే కేటాయించారు. సుబ్రమణియన్‌ సూచనతో తాను ఏకీభవిస్తున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2017, జూన్‌ నెలలో ప్రకటించారు. అయితే ఆ దిశగా ఆయన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈలోగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ‘సార్వత్రిక కనీస ఆదాయం’ పథకం ‘న్యాయ్‌’తో ఓటర్ల ముందుకు వచ్చారు. ఎంపిక చేసుకున్న వర్గానికి చెందిన ప్రజలు లేదా దారిద్య్ర రేఖకు దిగువున బతుకుతున్న ప్రతి వ్యక్తి ఖాతాలో వారానికి, పక్షానికి లేదా నెలకు కొంత మొత్తం నగదును డిపాజిట్‌ చేయడమే సార్వత్రిక కనీస ఆదాయం స్కీమ్‌. ఈ స్కీమ్‌ను అమెరికా, కెనడా లాంటి దేశాలు వ్యక్తుల ప్రాతిపదికనే అమలు చేస్తుండగా, భారత్‌లో రాహుల్‌ గాంధీ, కుటుంబాల ప్రాతిపదికన అమలు చేస్తానని చెబుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం లేనివారందరికి, వారి అవసరాలతో, వారి వ్యక్తిగత ఆదాయాలతో సంబంధం లేకుండా, వారి వయస్సును మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని నగదు డిపాజిట్‌తో ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు.

‘ఉటోపియా’ నవలలో ప్రస్థావన
1516లో థామస్‌ మోర్‌ రాసిన ‘ఉటోపియా’ నవలలో ‘యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌’ ప్రస్థావన ఉంది. ఓ మనిషి ముందుగా దొంగగా, ఆ తర్వాత శవంగా మారకుండా ఉండాలంటే పాలకులే ప్రతి పౌరుడికి కనీస ఆర్థిక భరోసా కల్పించాలని ఆ నవలలో ఓ ఇంగ్లీషు లాయర్‌ వాదిస్తారు. ఆ తర్వాత అమెరికా విప్లవకారుడు థామస్‌ పైనే (1737–1809), అమెరికా సామాజిక కార్యకర్త మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ (1929–1968), ప్రముఖ ఆర్థిక వేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మన్‌ (1912–2016), ఆ తర్వాత పలువురు మేధావులు ఏదోరకమైన ‘యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌’ స్కీమ్‌ ఉండాలంటూ వాదించారు. ఆర్థికవేత్తలుకానీ నేటి ప్రముఖులు మార్క్‌ జూకర్‌బర్గ్, ఎలాన్‌మస్క్, బెర్నీ శాండర్స్‌ కూడా యూఐబీ స్కీమ్‌కు మద్దతిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్థికవేత్త సుబ్రమణియన్‌ చేసిన సూచనను పరిశీలించిన కేంద్ర ఆర్థిక వేత్త అరుణ్‌ జైట్లీ, ఆయన సూచనతో ఏకీభవిస్తున్నాననుగానీ భారత్‌ లాంటి దేశంలో ఈ స్కీమ్‌ను అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీల్లో ఎందులో కోత విధించినా పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉన్నప్పుడు అమలు చేయడం అసాధ్యమేనని చెప్పారు. భారత దేశంలో ఆహారం, ఇంధనంపై ఇస్తున్న సబ్సిడీలను తొలగిస్తే ఈ పథకాన్ని అమలు చేయడం పెద్ద కష్టం కాదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 2017, అక్టోబర్‌లో భారత్‌కు సూచించింది. వాదించింది.

రాహుల్‌ గాంధీ  2019, జనవరి నెలలోనే తన రాజకీయ ఎజెండాలో యూఐబీ ప్రతిపాదనను చేర్చారు. దేశంలో దారిద్ర రేఖకు దిగువనున్న పేదల సంక్షేమం కోసం రేషన్‌పై ఆహారం, ఇంధనం సరఫరా చేసే పథకాలే కాదు, ఉపాధి హామీ సహా కేంద్ర ప్రభుత్వం దాదాపు 900 ప్రజా సంక్షేమ పథకాలను నేడు అమలు చేస్తోంది. వీటికి ఖర్చవుతున్న మొత్తం దేశ జీడీపీలో మూడు శాతం వాటాకు సమానం. ఇప్పుడు రాహుల్‌ హామీ ఇచ్చినట్లు దేశంలోని పేదలకు ఏటా 3,60,000 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో వేయడం అంటే అది జీడీపీలో 2.2 శాతం వాటాకు సమానం. రెండూ కలిపితే ఐదు శాతం దాటుతుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మార్గదర్శకాల ప్రకారం మన ద్రవ్యలోటు జీడీపీలో మూడు శాతానికి మించరాదు. ప్రస్తుతం ఆర్థిక లోటు 3.4 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి మనకు ఇక ఐదు పైసలు అప్పు పుట్టదు. ఈ పరిస్థితుల్లో ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కోత విధించకుండా యూఐబీ స్కీమ్‌ను అమలు చేయడం అసాధ్యం. (చదవండి: ‘అంత డబ్బు’ రాహుల్‌ వల్ల అవుతుందా?)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు