‘న్యాయ్‌’కు నిధులు దొంగ వ్యాపారుల నుంచే..

4 Apr, 2019 04:43 IST|Sakshi

మోదీ ‘సన్నిహితుల’ నుంచే రాబడతామన్న రాహుల్‌ గాంధీ

మోదీ రూ.15 లక్షల హామీ వట్టిదని అమిత్‌షాయే చెప్పారని వెల్లడి

బొకాఖత్‌/లఖింపూర్‌(అస్సాం): ‘న్యాయ్‌’పథకానికి అవసరమైన నిధులను ప్రధాని మోదీకి సన్నిహితులైన దొంగ వ్యాపారవేత్తల నుంచి రాబడతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తెలిపారు. బుధవారం ఆయన అస్సాంలోని బొకాఖత్, లఖింపూర్‌ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ‘ప్రజల అకౌంట్లలో డబ్బు జమ చేస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ..అంబానీల వంటి కొందరు ధనిక వ్యాపారవేత్తలకే మేలు చేశారు. గత నాలుగేళ్లుగా ప్రధాని మోదీ ద్వారా పొందిన అనిల్‌ అంబానీ వంటి దొంగ వ్యాపారవేత్తల నుంచి న్యాయ్‌ పథకానికి కావాల్సిన నిధులను రాబడతాం. పేదలు ముఖ్యంగా మహిళల అకౌంట్లలో జమ చేస్తాం’అని అన్నారు.

విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి రూ.15 లక్షలు చొప్పున ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనంటూ హత్యా నేరంలో నిందితుడైన బీజేపీ చీఫ్‌ అమిత్‌షాయే కొట్టిపారేశారని పేర్కొన్నారు. ధనికులకు మాత్రమే వాచ్‌మెన్‌(చౌకీదార్లు) ఉంటారనీ, వారికి మాత్రమే ప్రధాని కాపలాదారు అయ్యారని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగిత తీవ్రంగా పెరిగిపోయింది. వివాదాస్పద పౌరత్వ సవరణ బిల్లును అమల్లోకి రాకుండా చేస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించి, ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం.

మోదీ, బీజేపీ వణికిపోతున్నారు
కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకాన్ని(న్యాయ్‌) చూసి మోదీ, బీజేపీ వణికిపోతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నిరాశ, నిస్పృహకు గురయ్యారన్నారు. ‘న్యాయ్‌’ను కాంగ్రెస్‌ పార్టీ ‘మాగ్నాకార్టా’గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను అన్నివర్గాలు స్వాగతించాయన్నారు. ఎన్నికల్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నేతలు ఇతర పార్టీలు ఇచ్చే హామీలపై విమర్శలు చేసే నైతిక హక్కును కోల్పోతారని స్పష్టం చేశారు.

నేడు వయనాడ్‌లో నామినేషన్‌
కోజికోడ్‌: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి రాహుల్‌ గురువారం నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోజికోడ్‌ నుంచి హెలికాప్టర్‌లో వయనాడ్‌కు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేస్తారని, ఆయన వెంట సోదరి ప్రియాంకగాంధీ ఉంటారని సీనియర్‌ నేత ముకుల్‌ వాస్నిక్‌ చెప్పారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు రాహుల్‌ కోజికోడ్‌కు చేరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలను కూడా కాంగ్రెస్‌ కలుపుకుపోతుందనే భరోసా ప్రజల్లో కల్పించేందుకే వయనాడ్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు రాహుల్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు