నల్లధనం కోసం నోట్ల రద్దు

20 Apr, 2019 03:47 IST|Sakshi
ఛికోడెలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌

అందుకే మోదీ 500, వెయ్యి నోట్లను రద్దు చేశారు

న్యాయ్‌ పథకంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది: రాహుల్‌ గాంధీ

బాజీపుర(గుజరాత్‌): పాత రూ. 500, రూ. 1,000 నోట్లతో ఎక్కువ మొత్తం నల్లధనం సృష్టించేందుకు సాధ్యపడటం లేదు కాబట్టే ప్రధాని మోదీ అకస్మాత్తుగా నోట్ల రద్దు చేసి ఏకంగా రూ. 2,000 నోటును ప్రవేశపెట్టారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం ఆరోపించారు. రూ. 2 వేల నోటైతే భారీస్థాయిలో బ్లాక్‌మనీని ఎక్కువగా దాచేయొచ్చని మోదీ ఇలా చేశారని రాహుల్‌ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీని సక్రమంగా అమలు చేయకపోవడం వంటి మోదీ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనీ, తాము తేనున్న కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్‌)తో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని రాహుల్‌ చెప్పారు. గుజరాత్‌లోని బర్దోలీ జిల్లా బాజీపురలో రాహుల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  న్యాయ్‌ పథకం కింద తాము పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆదాయం ఉండేలా చేస్తామనీ, దీంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని దేశ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.

రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించకపోయినా వారు జైలుకు వెళ్లకుండా ఉండేలా తాము కొత్త చట్టం తెస్తామని రాహుల్‌ హామీనిచ్చారు. పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో తమ ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేశాయని ఆయన చెప్పారు. గురు, శుక్రవారాల్లో రాహుల్‌ గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని రాయచూరులోనూ రాహుల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీని పదవి నుంచి దింపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారనీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేది తమ పార్టీయేనని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘దేశాన్ని పటిష్టం చేయడం గురించి మోదీ మాట్లాడతారు. కానీ యువతకు ఉద్యోగాలు లేకపోతే దేశం పటిష్టం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా గెలుస్తారు. ఢిల్లీ నుంచి మోదీని ప్రజలు పంపిస్తారు’ అని అన్నారు.

ఆచూకీ చెబితే లక్ష ఇస్తాం: సిబల్‌
అహ్మదాబాద్‌లో పాతనోట్లను అక్రమంగా మారుస్తున్నట్లుగా వచ్చిన వీడియోలో ఉన్న వ్యక్తి గుర్తింపు వివరాలు చెప్పినవారికి కాంగ్రెస్‌ లక్ష రూపాయల బహుమానం ఇస్తుందని ఆ పార్టీ నేత కపిల్‌ సిబల్‌ శుక్రవారం ప్రకటించారు. పాతనోట్ల మార్పిడికి గడువ ముగిశాక రూ. 5 కోట్ల పాత నోట్లను అహ్మదాబాద్‌లో మార్చి ఇస్తున్నట్లుగా గతంలో ఓ వీడియో బయటకు రావడం తెలిసిందే.

మరిన్ని వార్తలు