కాంగ్రెస్‌లోనే సామాజిక న్యాయం

4 Jul, 2018 00:57 IST|Sakshi

ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్‌ తమరధ్వజ్‌ సాహూ

కాంగ్రెస్‌లో ఓబీసీలకు మంచి గుర్తింపు: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని రాజకీయ పార్టీల్లో సామాజిక న్యాయం అనే అజెండా ఒక్క కాంగ్రెస్‌ పార్టీలోనే ఉందని ఏఐసీసీ ఓబీసీ సెల్‌ చైర్మన్, ఎంపీ తమరధ్వజ్‌ సాహూ అన్నారు. బీసీలకు కాంగ్రెస్‌ పార్టీలోనే న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్‌ చిత్తరంజన్‌ దాస్‌ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాహూ మాట్లాడుతూ దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీలోనే గుర్తింపు ఉందని చెప్పారు.

2019లో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ఓబీసీలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్‌లో బీసీలకు మంచి గుర్తింపు ఉందని చెప్పారు. బీసీలంతా కాంగ్రెస్‌కు అండగా నిలబడి పార్టీలో పదవులకోసం పోరాడాలని, రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్‌లతో పాటు బీసీ నాయకులు పాల్గొన్నారు.

బీసీలకు ప్రాధాన్యతనివ్వాలి
పార్టీలో పనిచేస్తున్న బీసీలకు పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని టీపీసీసీ ఓబీసీ సెల్‌ కోరింది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఆమోదించింది. బీసీల హక్కులను హరించివేసే క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని, అన్ని పార్టీ కమిటీలతోపాటు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, 40 శాతం పదవులు ఓబీసీలకు కేటాయించాలని, ఓబీసీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, బీసీ సబ్‌ప్లాన్‌ను మేనిఫెస్టోలో చేర్చాలని తీర్మానాలను ఆమోదించారు.

మరిన్ని వార్తలు