రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు.. ఒకే ఓటరు!

22 Mar, 2019 09:03 IST|Sakshi
కొఠియా ప్రాంత గిరిజనులు 

ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు ఉండకూడదు. అలా ఉంటే ఏదో ఒకచోట ఉంచి మరోచోట తీసేస్తారు. కానీ ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న దాదాపు 34 గ్రామాల్లో ఇప్పటికీ సుమారు 2,934 ఓట్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఉదయం ఒడిస్సాలో ఓటేసిన వ్యక్తి, సాయంత్రం ఆంధ్రా ఎన్నికల్లో ఓటేస్తాడు. వినడానికి చిత్రంగా అనిపిస్తున్నా, ఇది ముమ్మాటికీ నిజం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిస్సాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్య, రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 7 వేల మంది ఓటర్లున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలో, ఒడిస్సాలోనూ ఓటు వేస్తున్నారు. 

నేటికీ తేలని వివాదం
1936లో ఒడిస్సా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్‌ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు. కొంతకాలం క్రితం ఓ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. చాలాకాలంగా ఆ
కమిటీ అధ్యయనం చేస్తోంది.  

ప్రయాణం..ప్రమాదం
విజయనగరం పట్టణం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలూరు ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి 40 కిలోమీటర్లు అడవులు, కొండల నడుమ అత్యంత ప్రమాదకర మార్గాల్లో ప్రయాణిస్తే కొఠియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. దాదాపు 14 కిలోమీటర్లు మేర రహదారి అనేదే ఉండదు. రాళ్లురప్పల్లో నడిచి వెళ్లాల్సిందే. అతికష్టం మీద కొంత దూరం వరకూ జీపులో వెళ్లినా పక్కనే వందల అడుగుల లోతున్న లోయల్లో మృత్యువు పొంచి ఉంటుంది. దీంతో ఇక్కడికి ఆంధ్రా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. రేషన్‌ కార్డులు కూడా మంజూరయ్యాయి. దీంతో గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు.  

ఆంధ్రా–ఒడిస్సా సరిహద్దులోని కొఠియా ప్రాంతం

ఆంధ్రా–ఒడిస్సా పోలింగ్‌ బూత్‌లు

ఆంధ్రా–ఒడిస్సా రేషన్‌ కార్డులతో గిరిజన మహిళ

ఆంధ్రా–ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు కొఠియా గ్రూపు గ్రామాల్లో ఆంధ్ర రాష్ట్రానికి పట్టుచెన్నేరు పంచాయతీలో 12, పగులు చెన్నేరు పంచాయతీలో 4, గంజాయిభద్రలో 13, సారికలో 2, కురుకూటిలో 2, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలున్నాయి. ఆంధ్రా ఎన్నికల కోసం నేరెళ్లవలస, శిఖపరువు, డి. వెలగవలస, కురుకూటిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఒడిస్సా ఎన్నికల కోసం కొఠియా, రణసింగి, గంజాయిభద్ర, పగులుచెన్నేరులో పోలింగ్‌ బూత్‌లు  ఏర్పాటు చేశారు. ఉదయం ఒడిస్సాలో ఓట్లు వేసిన తర్వాత మధ్యాహ్నం ఆంధ్రా రాష్ట్ర ఎన్నికల పోలింగ్‌లో ఓట్లు వేయడానికి వస్తారు. 
– బోణం గణేశ్, సాక్షి ప్రతినిధి, విజయనగర

మరిన్ని వార్తలు