బీజేపీ చీఫ్‌ విప్‌; రోడ్డుపైనుంచే విధులు..!

14 Jul, 2019 15:06 IST|Sakshi

భువనేశ్వర్‌ : కియోంజర్‌ ఎమ్మెల్యే, ఒడిశా అసెంబ్లీలో బీజేపీ చీఫ్‌ విప్‌ మోహన్‌చరణ్‌ మాంఝి రాష్ట్ర ‍ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫుట్‌పాత్‌పై నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. తన దుస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని విమర్శించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకూ తనకు అధికారిక బంగ్లా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విపక్ష సభ్యులకు బంగ్లా కేటాయించకుండా పక్షపాతం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. బంగ్లా కేటాయించేవరకు రోడ్డుపైనుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. కనీసం రాష్ట్ర అతిథి గృహంలో ఒక గదినైనా కేటాయించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు.

‘నెల రోజులైనా ఇప్పటివరకు బంగ్లా కేటాయించలేదు. ఇప్పటికే నా వ్యక్తిగత సహాయకుడిపై కూడా కొందరు దాడి చేసి.. విలువైన పత్రాలు, కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారు. కనీసం సెక్యూరిటీని కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా ఇంతవరకు స్పందించలేదు. నాలాగే చాలా మంది ఎమ్మెల్యేలకు గెస్ట్‌హౌజ్‌లు కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’అని మాంఝి అన్నారు. కాగా, ఈ విషయం అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌ఎన్‌ పాత్రో దృష్టికి వెళ్లడంతో.. ఎమ్మెల్యేల సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యేలా చూస్తానని హామినిచ్చారు. మాంఝి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మరిన్ని వార్తలు