ఓటు వేయిస్తాం..ఇది మా 'వాదా'..

23 Oct, 2018 02:28 IST|Sakshi
హరిచందన దాసరి, ‘స్వీప్‌’నోడల్‌ అధికారి  

ఓటు కోసం..మీ ఇంటికే సహాయకులు 

తొలిసారిగా అందుబాటులోకి యాప్‌ 

దివ్యాంగులు,గర్భిణులు,వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాటు 

కోరుకున్న వారికి ఇంటికే వాహనం 

నేడు యాప్‌ను ప్రారంభించనున్న సీఈఓ  

నగర ప్రజలు పోలింగ్‌పై ఆసక్తి కనపరచడంలేదు. ఏ ఎన్నికల్లో చూసినా ఇది రుజువు అవుతోంది. గత ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నవారు 53 శాతం మందే. ఆసక్తి లేక పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లనివారు కొందరైతే, వెళ్లేందుకు శక్తిలేని వారు ఎందరో. ఇలాంటి వారిలో గర్భిణులు, వయోధికులు, అంధులతో సహా దివ్యాంగులుంటున్నారు. ఈసారి వారు సైతం అధికసంఖ్యలో ఓటు వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.అందుకనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ భావించారు.ఆయన నేతృత్వంలో, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ , ‘సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌(స్వీప్‌)’నోడల్‌ అధికారి హరిచందన పర్యవేక్షణలో ప్రత్యేక యాప్‌ రూపొందించింది జీహెచ్‌ఎంసీ . అందరూ వినియోగిస్తున్న సెల్‌ఫోన్లను, ఆన్‌లైన్‌ను దృష్టిలో ఉంచుకొని ఐటీలో నిపుణులైన పలువురు ప్రోగ్రామర్లు, డెవలపర్లతో వారం రోజుల పాటు శ్రమించి ఈ ప్రత్యేక యాప్‌కు రూపకల్పన చేశారు. ఓటర్‌ యాక్సెస్‌బిలిటీ యాప్‌ ఫర్‌ ద డిఫరెంట్లీ ఏబుల్డ్‌ (వాదా)గా పేరు పెట్టారు. వాదా(హామీ) అనే అర్థమొచ్చేలా ఈ పేరు పెట్టారు. ఈ యాప్‌ను వినియోగించుకోవడం ద్వారా సులభంగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి, తిరిగి తమ ఇళ్ల వద్దకు చేరుకోవచ్చు.పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని వారికి అధికారులు వాహన సదుపాయం కల్పిస్తారు. ఓటు వేయడంలో సహకరిస్తారు. 
    – సాక్షి,హైదరాబాద్‌ 

నేడు యాప్‌ ఆవిష్కరణ 
ఈ యాప్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓంప్రకాశ్‌ రావత్‌ మంగళవారం ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.  

యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాక..ఇలా చేస్తే చాలు 
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలనుకునే ఓటరు పేరు, మొబైల్‌ నెంబర్‌ వంటి వివరాలతోపాటు ఎలాంటి అశక్తతతో ఉన్నారు..ఎలాంటి సాయం కోరుకుంటున్నారు, ఎన్ని గంటలకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారో తెలియజేయాలి. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో దేన్నయినా ఎంచుకొని ఈ వివరాలు పూర్తిచేయవచ్చు. వివరాల్ని టైప్‌ చేయలేని వారు వాయిస్‌ రికార్డు ద్వారా అయినా నమోదు చేసి పంపించవచ్చు. వాటిని నమోదు చేయగానే జీఐఎస్‌తో ఓటరు ఎక్కడున్నదీ అధికారులకు తెలుస్తుంది. ఇలా ఓటరు నివాసంతో సహా పూర్తివివరాలన్నీ సర్వర్‌లో నిక్షిప్తమవుతాయి.హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 3వేల పైచిలుకు పోలింగ్‌ కేంద్రాలు దీనితో అనుసంధానమై ఉంటాయి.వారు తమ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు వీలుగా అధికారులు తగిన ఏర్పాట్లుచేస్తారు. ఆమేరకు బూత్‌ స్థాయి అధికారులకు సూచనలిస్తారు. 

హైదరాబాద్‌ జిల్లా ఓటర్ల జాబితా మేరకు 20వేలకు పైగా దివ్యాంగులున్నారు. 22 రకాలైన అశక్తతలతో ఉన్నవారు వీరిలో ఉన్నారు. వీరితోపాటు గర్భిణులు, 65 ఏళ్లు దాటిన వయోధికులు సైతం ఓటు వేసేందుకు సహాయ మందిస్తాం. జీఐఎస్, జియోట్యాగింగ్‌లతో ఓటర్లకు ఇలాంటి సదుపాయం కల్పించడం దేశంలో బహుశా ఇదే ప్రథమం. వివరాలు పంపిన వారిని పోలింగ్‌ స్టేషన్‌ వరకు తీసుకువెళ్లడం, వారు ఓటు వేశాక తిరిగి ఇంటివద్ద దిగబెట్టడంతోపాటు పోలింగ్‌ కేంద్రంలో తోడుగా సహాయకుడు కావాలన్నా అనుమతిస్తాం. 
– హరిచందన దాసరి, ‘స్వీప్‌’నోడల్‌ అధికారి  

మరిన్ని వార్తలు