ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

27 Jul, 2019 04:26 IST|Sakshi

సభలో బేషరతు క్షమాపణ చెప్పాల్సిందిగా స్పీకర్‌ ఆదేశం!

లేని పక్షంలో ఖాన్‌పై చర్యలు తీసుకునేందుకు స్పీకర్‌కు అధికారం  

న్యూఢిల్లీ: లోక్‌సభ డెప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ  చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్‌ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి.  అన్ని పార్టీల నాయకులతో స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్‌ అంశంపై చర్చించారు.

అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ ఆజం ఖాన్‌ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు లోక్‌సభ ఇస్తుందని తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, తృణమూల్‌ ఎంపీ మిమి చక్రవర్తి, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ తదితర మహిళా ఎంపీలతోపాటు బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఆజంఖాన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆజం ఖాన్‌ను ఈ లోక్‌సభ నుంచి పూర్తిగా బహిష్కరించేలా ఆయనను ఐదేళ్లపాటు సస్పెండ్‌ చేయాలని రమాదేవి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు