స్పీకర్‌గా బిర్లా ఏకగ్రీవం

20 Jun, 2019 03:24 IST|Sakshi
స్పీకర్‌గా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, బిర్లాల పరస్పర అభివాదం

నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా: ఓం బిర్లా

న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. రాజస్తాన్‌లోని కోటా నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయిన బిర్లా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, తృణమూల్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ తదితరులు మద్దతు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల బరిలో బిర్లా ఒక్కరే ఉండటంతో ఆయనను స్పీకర్‌గా ఎంపికచేస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయినట్టు ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర ప్రకటించారు.

ప్రధాని మోదీ స్వయంగా బిర్లాను స్పీకర్‌ కుర్చీ దగ్గరకు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా పలువురు ఎంపీలు పోడియం వద్దకు వచ్చి కొత్త స్పీకర్‌ను అభినందించారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతిపక్షాలు నూతన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాయి. ‘సభ నిర్వహణలో మీకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం, అధికార పక్షం తరఫున నేను హామీ ఇస్తున్నాను. సభలో మీ మాటే చెల్లుతుంది. మా వాళ్లతో సహా ఎవరు హద్దుమీరినా మీరు కఠిన చర్య తీసుకోవాలి’ అని మోదీ అన్నారు. తనను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు బిర్లా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇస్తానని అన్నారు.

సభను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకు విపక్షాలకు తగినంత సమయం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ కొత్త స్పీకర్‌ను కోరారు. స్పీకరే సభకు అధిపతి అని, దేశ స్వాతంత్య్రానికి, జాతికి ఆ పదవి ప్రతిబింబమని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఇంతవరకు లోక్‌సభ చాలా తక్కువ బిల్లులనే స్థాయీ సంఘానికి సిఫారసు చేస్తూ వస్తోందని, ఇకనైనా ఆ తీరు మారాలన్నారు. బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చల్లో ప్రాంతీయ, చిన్న పార్టీల సభ్యులకు తగినంత సమయం కేటాయించాలని అకాలీదళ్‌ ఎంపీ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్, ఆప్నాదళ్‌ ఎంపీ అనుప్రియ పటేల్‌ సూచించారు.

మరిన్ని వార్తలు