దీదీనే పీఎం అభ్యర్థి..

27 Jul, 2018 20:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర ఫ్రంట్‌కు పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థిగా సారథ్యం వహిస్తారని జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్ధుల్లా సంకేతాలు పంపారు. అబ్దుల్లా శుక్రవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. మమతా బెనర్జీ బెంగాల్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అందించేందుకు ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళతామని దీదీతో భేటీ అనంతరం ఆయన చెప్పారు.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై తాము చర్చించామని, మైనారిటీలు ఎదుర్కొంటున్న భయానక వాతావరణంపై భీతిల్లామన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, తృణమూల్‌ వైఖరుల్లో ఎలాంటి వైరుధ్యం లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారంతా తమతో చేతులు కలపవచ్చని, ఆ పార్టీని మట్టికరిపించేందుకు తమతో కలిసిరావాలని పిలుపు ఇచ్చారు.

మరోవైపు బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ సమిష్టిగా ప్రజల పక్షాన పోరాడాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. బీజేపీ పాలన నియంత పోకడలను తలపిస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు