ఛత్తీస్‌గఢ్‌ సీఎంపై మండిపడ్డ ఒమర్‌ అబ్దుల్లా

21 Jul, 2020 10:45 IST|Sakshi
ఒమర్‌ అబ్దుల్లా, సచిన్‌ పైలట్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా(ఫొటో: ఏఎఫ్‌పీ)

శ్రీనగర్‌: రాజస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌‌ భగేల్‌, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తన బావ సచిన్‌ పైలట్‌ను లక్ష్యంగా చేసుకుని తమపై విమర్శలకు దిగిన భూపేశ్‌ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒమర్‌ హెచ్చరించారు. హానికరమైన, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి తీరుతో విసిగిపోయానని.. అందుకే పార్టీ పరిస్థితి ఇలా ఉందంటూ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు స్పందించిన భూపేశ్‌ భగేల్‌.. తాను అడిగింది కేవలం ఒక ప్రశ్నేనని, ఇకపై కూడా అలాగే అడుగుతూ ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని.. ఇలాంటి సమయంలో తన మాటలను అవకాశంగా మలచుకునేందుకు ప్రయత్నించవద్దంటూ హితవు పలికారు. ఇందుకు బదులిచ్చిన ఒమర్‌.. ‘‘నా లాయర్లకు మీరు మీ సమాధానాలు చెప్పండి. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న తప్పు ఇదే. మీకు మీ స్నేహితులెవరో, వ్యతిరేకులు ఎవరో తెలియదు. అందుకే ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. మీ ప్రశ్న హానికరమైనది’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. (నిర్బంధం నుంచి ఒమర్‌ అబ్దుల్లా విడుదల)

సచిన్‌ పైలట్‌ బావమరిది కాబట్టే..
కాగా గత కొన్ని రోజులుగా రాజస్తాన్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై భూపేశ్‌ భగేల్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుకు, జమ్మూ కశ్మీర్‌ నేతలు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదల కావడానికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. సచిన్‌ పైలట్‌ మామ, బావ మరిది అయినందు వల్లే వీరికి విముక్తి కలిగి ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు.. ‘‘రాజస్తాన్‌లో జరుగుతున్న సంఘటనలను, సచిన్‌ పైలట్‌ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఒమర్‌ అబ్దుల్లా ఎందుకు విడుదలయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఒమర్‌తో పాటు మెహబూబా ముఫ్తి(జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం)కూడా హౌజ్‌ అరెస్ట్‌ అయ్యారు. కానీ ముఫ్తీజీ మాత్రం నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ సచిన్‌ పైలట్‌ బావ మరిది అయినందు వల్ల ఒమర్‌కు విముక్తి లభించింది’’అంటూ సచిన్‌ పైలట్‌ ఎపిసోడ్‌, ఆయనతో రాజస్తాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్ని.. అందుకు ప్రతిఫలంగా ఒమర్‌ను విడుదల చేశారనే అర్థంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఒమర్‌ అబ్దుల్లా... తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన భూపేశ్‌ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని.. ఆయన తన లాయర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్యాయంగా తమ నాయకులను నిర్బంధంలో ఉంచితే చట్టపరంగా సవాలు చేసి విముక్తి పొందారంటూ భూపేశ్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్సీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఒమర్‌ అబ్దుల్లా సోదరి సారా అబ్దుల్లా సచిన్‌ పైలట్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ తొలుత వీరి ప్రేమకు అంగీకారం లభించకపోవడంతో పెద్దలను ఎదిరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత విభేదాలన్నీ తొలగిపోయి ఇరు కుటుంబాలు కలిసి పోవడంతో కథ సుఖాంతమైంది.

మరిన్ని వార్తలు