ఐదుగంటల్లోపే ఫలితాలు

16 May, 2019 00:41 IST|Sakshi

27న పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ 

ముందుగా ఎంపీటీసీ..ఆ తర్వాత జెడ్పీటీసీల ఫలితాలు 

వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి 

పటిష్టమైన భద్రతనడుమస్ట్రాంగ్‌రూమ్‌ల్లో బ్యాలెట్‌ బాక్స్‌లు 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి 32 జిల్లాల్లోని 123 కౌంటింగ్‌ కేంద్రాల్లోని 978 హాళ్లలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 11,882 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 23,647 కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించినట్లు తెలియజేశారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించాకే.. జెడ్పీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 27న సాయంత్రం 5 గంటల లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరచడానికి రాష్ట్రవ్యాప్తంగా 536 స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మూడువిడతల్లో జరిగిన పరిషత్‌ పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడం.. మొత్తంగా కలిపి 77.46% పోలింగ్‌ నమోదు కావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.

గ్రామపంచాయతీ ఎన్నికలతో ఈ పోలింగ్‌శాతం కొంత తగ్గినా లోక్‌సభ (62.69%), అసెంబ్లీ (73.40) ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరగడం హర్షనీయమన్నారు. బుధవారం ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డిలతో కలిసి నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో కేవలం మూడు ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించామన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒకరికి బదులుగా మరొకరు ఓటేసిన ఉదంతాలు చోటు చేసుకోలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టెండర్‌ ఓటింగ్‌ కారణంగా 7 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించామన్నారు. పోలింగ్‌బూత్‌లో ఓటేశాక సెల్ఫీ దిగడం, ఓటేసిన బ్యాలెట్‌ పేపర్ల ప్రదర్శన వంటి వాటి విషయంలో నాలుగు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 

‘ఏకగ్రీవానికి 10 లక్షలు’పై సీరియస్‌ 
నాగర్‌కర్నూలు జిల్లా గగ్గల్లపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ఒక అభ్యర్థికి రూ.10 లక్షలిచ్చి ప్రలోభాలకు గురిచేసినట్టు తేలడం చాలా తీవ్రమైన విషయమన్నారు. ఒక ఎంపీటీసీ స్థానంలో ఇంతపెద్దమొత్తంలో డబ్బు దొరకడంతో ఆ స్థానంలో ఎన్నిక రద్దుచేసినట్టు చెప్పారు. దీనికి పాల్పడ్డ వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నిరూపితమైతే ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఎనిమిది చోట్ల ఎంపీటీసీ బ్యాలెట్‌పత్రాలు తారుమారు కాగా, అప్పటికే ఐదుచోట్ల అప్పటికే ఓటేసిన ఓటర్లను పిలిపించి పరిస్థితిని చక్కదిద్దగలిగారన్నారు.

మరో రెండు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా, వనపర్తి జిల్లా పానగల్‌ మండలం కదిరిపాడు ఎంపీటీసీ స్థానానికి శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. మొత్తం 1.56 కోట్ల మంది గ్రామీణ ఓటర్లలో 1.20 కోట్ల మంది ఓటేశారని చెప్పారు. ఈ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.1.09 కోట్ల విలువైన నగదును, రూ. 1.04 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘనకు సంబంధించి 119 ఫిర్యాదులు అందాయన్నారు. మొత్తం 220 ఫిర్యాదులు దాఖలు కాగా, 386 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. 359 కేసుల్లో చర్యలు తీసుకోగా, మరో పదికేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 

కౌంటింగ్‌ ఇలా! 
స్ట్రాంగ్‌ రూంల వద్ద భద్రతా బలగాల డబుల్‌ సెక్యూరిటీ కవర్‌ ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో బ్యాలెట్‌ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారని, ఇది పోలింగ్‌ కేంద్రాల వారీగా జరుగుతుందన్నారు. ఆ తర్వాత వీటిని బండిల్‌ చేస్తారని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్‌లో 25 బ్యాలెట్‌ పత్రాలు ఉంటాయన్నారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్‌ మొదలుపెడుతారని, ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఉంటాయన్నారు. ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు.

ప్రతి బ్యాలెట్‌ పేపర్‌ను ఓపెన్‌ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూస్తారని, చెల్లుబాటు అయితే ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారని, అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం రిటర్నింగ్‌ అధికారుల దగ్గరకు పంపించి, నిర్ణయం తీసుకుంటారన్నారు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్‌ అధికారులతో తుది నిర్ణయం ఉంటుందన్నారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తామని, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తామని, ఒక రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తామని, ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశామన్నారు. 

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం 
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉందని నాగిరెడ్డి చెప్పారు. గత జూన్‌ నుంచే ఈ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టామన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలం జూలై మొదటివారంలో ముగుస్తుందన్నారు. అయితే ప్రభుత్వపరంగా మున్సిపాలిటీ వార్డుల పునర్విభజన పూర్తిచేయాల్సి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న పక్షంలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాక మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందన్నారు.

జూలై మొదటి వారంలోనే కొత్తసభ్యులు 
ఉమ్మడి ఖమ్మం మినహా అన్నిజిల్లాల్లో ప్రస్తుత మండల ›ప్రజా పరిషత్‌ (ఎంపీపీ)ల పదవీకాలం జూలై 3తో, జెడ్పీల పదవీకాలం జూలై 4తో పూర్తవుతుందని నాగిరెడ్డి చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీపీల పదవీకాలం ఆగస్టు 5తో, జెడ్పీల పదవీకాలం ఆగస్టు 6తో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన చోట్ల కొత్త ఎంపీటీసీలు జూలై 4న బాధ్యతలు చేపడతారని, ఆ తర్వాత ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. పాత జెడ్పీటీసీల పదవీకాలం జూలైæ 4న ముగుస్తుండడంతో 5న కొత్త సభ్యులు బాధ్యతలు చేపడతారన్నారు. జెడ్పీ చైర్మన్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు