ముందస్తు మొనగాడు కేసీఆర్‌.!

11 Dec, 2018 13:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజకీయాల్లో కాకతాళీయంగా ఏదీ జరగదు, అన్నీ పథకం ప్రకారం అమలు చేస్తేనే జరుగుతాయని అంటారు. ఈ సంగతి బాగా తెలిసిన కేసీఆర్, యుద్ధం తనకు అనువుగా ఉన్నప్పుడే చేయాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులను లాగారు. ఎన్నికలకు 9 నెలల సమయం ఉన్నా.. జనాకర్షక పథకాలపై నమ్మకంతో బరిలోకి దిగి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా దేశంలోనే ముందస్తుకు వెళ్లి గెలిచిన నేతగా కేసీఆర్‌ చరిత్రకెక్కారు.

గతంలో ముందస్తుకు వెళ్లిన అన్ని ప్రభుత్వాలు ఎన్నికల్లో చతికిలబడగా.. టీఆర్‌ఎస్‌ మాత్రం విజయంతో గత చరిత్రను తిరగరాసింది. నిజానికి, ఉమ్మడి ఏపీలో మూడుసార్లు జరిగిన ముందస్తుల్లోనూ అధికార పార్టీ ఓటమి చవిచూసింది. ఆంధ్రపద్రేశ్‌ ఏర్పడిన నాటినుంచి 1978 దాకా షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో దివంగత నేత ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీ పెట్టాక అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఆ ఏడాది జనవరిలోనే నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ఎన్నికలను ముందుకు జరిపారు. కానీ, టీడీపీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోయింది. ఎన్టీఆర్‌ పార్టీ 202 స్థానాలతో అధికారం చేపట్టింది. తదుపరి 1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఎన్టీఆర్‌ 4 నెలలు ముందుకు జరిపారు. ఈ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2004 వరకూ అసెంబ్లీ గడువు ఉన్నా.. 2003 నవంబరులోనే అసెంబ్లీని అప్పటి సీఎం చంద్రబాబు రద్దు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ మాత్రం ఎన్నికలను 2004లోనే జరిపింది. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చరిష్మా ముందు చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. వైఎస్సార్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ జయభేరి మోగించింది. అంటే, ముందస్తుకు ప్రయత్నించిన కోట్ల, ఎన్టీఆర్‌, చంద్రబాబు ముగ్గురూ భంగపడ్డారు. తాజా విజయంతో కేసీఆర్‌ ఈ చరిత్రను తిరగరాశారు

జాతీయ రాజకీయాల్లోను..
ఇక, 1969లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బహిష్కరించడంతో కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది. దాంతో, మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఇందిర తొలిసారిగా ముందస్తు ప్రయోగం జరిపారు. ఏడాది ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లారు. గరీబీ హఠావో నినాదంతో 352 స్థానాల్లో విజయం సాధించారు. 2004లో అప్పటి ప్రధాని వాజపేయి 
ముందస్తుకు అయిష్టంగా ఉన్నా ఎల్‌కే ఆడ్వాణీ ప్రేరేపణతో ఎన్నికలకు వెళ్లారు. ‘భారత్‌ వెలిగిపోతోంది’  అనే నినాదంతో ప్రజల తీర్పు కోరిన ఎన్డీయే పరాజయం పాలైంది. 

మరిన్ని వార్తలు