ఏయ్‌ పోలీస్‌ ఖబడ్దార్‌

8 Apr, 2019 12:53 IST|Sakshi

ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల బరితెగింపు

జాగ్రత్త.. ఎస్పీకి ఫిర్యాదు చేస్తా

మేం ఏం చేసినా చూడటమే మీ పని

చేష్టలుడిగి చూసిన అధికారులు

కొత్తపట్నం: ఎన్నికల ప్రచారంలో బాణసంచా కాల్చకూడదన్న పోలీసులపై అధికార పార్టీ నేత రెచ్చిపోయాడు. ఖబడ్దార్‌.. జాగ్రత్త అంటూ తీవ్ర పదజాలంతో రోడ్‌ షోలో మైక్‌ ద్వారా వార్నింగ్‌ ఇచ్చాడు. ప్రకాశం జిల్లా   టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దనరావు ఆదివారం రాత్రి నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బస్టాండ్‌ సెంటర్‌లో రోడ్‌షో నిర్వహిస్తుండగా పార్టీ కార్యకర్తలు మందుగుండు సామగ్రి పేల్చడం మొదలు పెట్టారు. ఆ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ఎన్నికల నింబంధనల ప్రకారం మందుగుండు పేల్చకూడదని వారి నుంచి బాణసంచా తీసుకున్నారు.

దీనిపై కార్యకర్తలు దామచర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన జనార్దన్‌ ‘ఏయ్‌ పోలీస్‌.. ఖబడ్దార్‌! మా వాళ్లు మందుగుండు పేల్చుతుంటే తీసుకుంటావా, నీ మీద ఎస్పీకి ఫిర్యాదు చేస్తా.. మేము చేస్తా ఉంటే చూడటమే మీ పని. నీ ఇష్టం జాగ్రత్తగా ఉండు’ అంటూ బహిరంగ సభలోనే మైక్‌ ద్వారా  తీవ్ర స్వరంతో హెచ్చరించాడు.ఈ హఠాత్పరిణామంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది నిర్ఘాంతపోయారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రోడ్డుషోలో బాణసంచా భారీగా పేల్చారు. కాగా, ఇటీవల వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్డుషో సందర్భంగా మందుగుండు సామగ్రి  పేల్చుతుంటే.. పోలీసులు కార్యకర్తల చేతుల్లో నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కార్యకర్తలు బాలినేనికి ఫిర్యాదు చేస్తే పోలీసులకు సహకరించాలని బాణాసంచా కాల్పులు నిలుపుదల చేయించారు.  

మరిన్ని వార్తలు