గులాబీ గూటికి ఒంటేరు..!

18 Jan, 2019 01:17 IST|Sakshi

నేడు కేసీఆర్‌తో భేటీ

గజ్వేల్‌లో పార్టీ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్‌

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతగా ఉన్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. గులాబీ గూటికి చేరుతున్నారనే వార్త ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సంచలనంగా మారింది. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తన ముఖ్య అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహ క అధ్యక్షుడు కేటీఆర్‌తో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిసింది. దీంతో శుక్రవారం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఒంటేరు చేరికతో కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తు న్న గజ్వేల్‌ నియోజకవర్గంలో గులాబీ సేనకు ఎదురే ఉండదని నాయకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ భవిష్యత్‌పై చర్చ
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి గట్టి పోటీనిచ్చి, గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రతాప్‌రెడ్డి.. కేసీఆర్‌పై 15వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒంటేరు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత ఐదేళ్లపాటు ఆయన కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచీ ఎక్కడా తగ్గకుండా కేసీఆర్‌కు దీటుగా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు వేసిన ఎత్తుగడ కూడా ఫలించింది. అయినా ఒంటేరుకు కేసీఆర్‌ చేతిలో ఓటమి తప్పలేదు. పరాజయంపాలైనా.. నిత్యం కేడర్‌తో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ గజ్వేల్‌ నియోజకవర్గంలో తమ కేడర్‌ను బరిలో నిలిపారు.

ఈ నేపథ్యంలో గజ్వేల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు ఉండకూడదంటే.. ఒంటేరును పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో గులాబీ నేతలు పావులు కదిపారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌ నేరుగా రంగంలోకి దిగి ఒంటేరుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒంటేరుకు గజ్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు అంగీకరించినట్లు తెలిసింది. దీంతోపాటుగా ప్రతాప్‌రెడ్డి కుమారునికి కూడా మంచి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం మేరకు శుక్రవారం ఒంటేరు ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలుస్తారు. అనంతరం తెలం గాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. ఆ తర్వాత గజ్వేల్‌ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరాల్సిన ఆవశ్యకతను కేడర్‌కు వివరించి వారిని కూడా టీఆర్‌ఎస్‌లో చేర్పిస్తారని సమాచారం. 

మరిన్ని వార్తలు