నేడు వనపర్తిలో బహిరంగ సభ

5 Oct, 2018 02:32 IST|Sakshi

సాక్షి, వనపర్తి: వనపర్తి ‘ఆశీర్వాద సభ’ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శుక్రవారం ఇక్కడ జరగే సభకు టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు హాజరుకానున్నారు. సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మందిని  తరలించేలా నాయకులు ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు మంత్రులు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.

  అసెంబ్లీని రద్దు చేశాక ఉమ్మడి జిల్లాలో తొలిసారి సీఎం కేసీఆర్‌ పాల్గొననున్న భారీ బహిరంగసభ కావడంతో ఆపద్ధర్మ మం త్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆల వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు సభను విజయవంతం చేసేందుకు అన్ని మండలాల్లో నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.  కేసీఆర్‌ హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా వేదికకు 200 మీటర్ల దూరంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అరవై ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణాన్ని ఏర్పా టు చేశారు. ఇక భద్రతా విధుల్లో ముగ్గురు ఎస్పీలు, 27 మంది సీఐలు, 63 మంది ఎస్‌ఐలతోపాటు 1,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

అసంతృప్తి సంగతేమిటి?
మక్తల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు నాయకులు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.  కల్వకుర్తిలోనూ జైపాల్‌యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించగా.. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్రంగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇలా అసమ్మతి రాగం వినిపిస్తున్న వారి విషయంలో కేసీఆర్‌ బహిరంగ సభలో ఏమైనా ప్రకటన చేస్తారా అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.  

వనపర్తి సభపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం సరళిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా నివేదికలను తెప్పించుకుని అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు ఆయా నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా చేసిన పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. వనపర్తిలో శుక్రవారం జరగనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ బహిరంగసభ ఏర్పాట్లపై కేసీఆర్‌ సమీక్షించారు. జనసమీకరణ విషయంలో రాజీపడొద్దని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ సి.నిరంజన్‌రెడ్డిలకు ఫోన్‌లో సూచించారు

మరిన్ని వార్తలు