తలాక్‌ బిల్లుపై విపక్షాల కీలక నిర్ణయం

31 Dec, 2018 10:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్‌ తలాక్‌బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలో కేంంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశాయి.  తీవ్ర గందరగోళం నడుమ రాజ్యసభను బుధవారంకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ తెలిపారు.

అంతకుముందు బిల్లును అడ్డుకుంటామని కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్షాలు ఘంటాపథకంగా చెప్పి, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత తీర్మానంపై 11 పార్టీలు సంతకం చేశాయి. చర్చకు ముందు తీర్మానంపై ఓటింగ్‌ జరగాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రతిపక్షాల ఆందోళనలు ఒకవైపు, రాజ్యసభలో అధికార పార్టీకి సంఖ్యాబలం లేకపోవడం మరోవైపు బీజేపీకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ కీలకమైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితేనే చట్టంగా మారనుంది. ఇదిలావుండగా సోమవారం జరిగి రాజ్యసభ సమావేశాలను సభ్యులందరూ హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విప్‌ను జారీచేశాయి.

మరిన్ని వార్తలు