కశ్మీర్‌పై చేతులెత్తేసిన ప్రతిపక్షం

20 Aug, 2019 14:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌ను రెండు ముక్కలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల్లో ఒక్క డీఎంకే మినహా మిగతా పార్టీలన్నీ చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తోంది. ఆయా పార్టీల అభ్యంతరాలు, విమర్శలు సోషల్‌ మీడియాకే పరిమితం అవుతున్నాయి. ప్రత్యక్ష కార్యాచరణ అసలే లేదు. ‘ఎలాంటి షరతులు లేకుండా అనుమతిస్తే నేను కశ్మీర్‌లో పర్యటిస్తా’ అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాహుల్‌ గాంధీ, కశ్మీర్‌ గవర్నర్‌కు పలు ట్వీట్లు చేశారు. దానికి గవర్నర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన ఇంకేం మాట్లాడకున్న మిన్నకుండి పోయారు. 

కశ్మీర్‌ నాయకులు గృహ నిర్బంధాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చివరి నిమిషంలో ఆ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్లు లేరు. కశ్మీర్‌ విభజన ప్రక్రియను ఆమె వ్యతిరేకించినప్పటికీ సంబంధిత బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఓటు వేయాల్సిన తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. లోక్‌సభలో మూడవ బలమైన పార్టీగా అవతరించిన డీఎంకే మాత్రమే మొదటి నుంచి కశ్మీర్‌పై నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వస్తోంది. కశ్మీర్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ఓటు వేయడమే కాకుండా కశ్మీర్‌ నాయకుల గహ నిర్బంధానికి వ్యతిరేకంగా ఆగస్టు 22వ తేదీన ఆ పార్టీ ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది. 

కశ్మీర్‌ బిల్లు విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు పూర్తిగా అప్రజాస్వామికం అంటూ డీఎంకే విమర్శించడమే కాకుండా ఇలాంటి ప్రక్రియ పట్ల మెతక వైఖరి అవలంబించినట్లయితే మున్ముందు ఏ రాష్ట్రాన్నైనా బీజేపీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ వస్తోంది. 

మరిన్ని వార్తలు