రాహుల్‌కి తొలిదెబ్బ...!

26 Jul, 2018 08:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి తొలిదెబ్బ పడింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీని నియమిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విపక్షాల నేతలు మాత్రం ఎవరికివారు ‘మేము సైతం’ అంటూ తెరపైకి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతల ద్వారా వాళ్లే పీఎం అభ్యర్థులంటూ ప్రకటనలు కూడా చేయిస్తున్నారు. పొత్తులపై పూర్తి అధికారాన్ని రాహుల్‌కు సీడబ్ల్యూసీ అప్పగించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం విశేషం. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ'బ్రెయిన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ... టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ(63)నే విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషించబోతున్నాయి. పీఎం అభ్యర్థితత్వానికి మమత అని విధాలా అర్హత ఉన్న వ్యక్తి. బెంగాల్‌ ప్రజలే కాదు.. దేశం మొత్తం ఆమెను ఓ శక్తివంతమైన నేతగా ప్రజలు అంగీకరించారు. రేసులో ఆమె ముందున్నారన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు’ అని ఓ’బ్రెయిన్‌ ప్రకటించారు. 

మరోవైపు గత కొన్నిరోజులుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి(62) పేరు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీలతో జోరుగా మంతనాలు సాగిస్తున్న ఆమె.. బుధవారం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో భేటీ అయి పొత్తులపై చర్చించారు కూడా. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌తో కలిసి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు బీఎస్పీ సిద్ధమైన తరుణంలో.. రాహుల్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ సొంత పార్టీ నేతలకు మాయావతి హుకుం జారీ చేశారు. ఈ తరుణంలో 2019 ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారంటున్నారు జేడీఎస్‌ నేత దానిష్‌ అలీ(కర్ణాటక) బుధవారం వ్యాఖ్యలు చేయటం గమనార్హం.  

మరోవైపు ఎన్సీపీ ఛీప్‌ శరద్‌ పవార్‌ పేరును కూడా ఆయన పార్టీ ప్రస్తావనకు తెస్తోంది. ‘మరాఠా శక్తివంతమైన రాజకీయ వేత్త. ప్రధాని కావాలన్న ఆయన కల 2019 ఎన్నికలతో తీరబోతోంది’ అని పవార్‌ అనుచరుడు ప్రఫూల్‌ పటేల్‌ వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో విపక్షాలన్నీ కలిసి బీజేపీ అవకాశాలను ఎలా దెబ్బ కొట్టాలన్న దానిపై దృష్టిసారిస్తే మంచిదని.. ప్రధాని అభ్యర్థిత్వం ఆలోచన అప్రస్తుతమని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు