బీజేపీపై ఉమ్మడి పోరాటం

11 Dec, 2018 04:53 IST|Sakshi
విపక్షాల భేటీలో పాల్గొన్న సోనియా, రాహుల్, మన్మోహన్, దేవెగౌడ, చంద్రబాబు తదితరులు

ఎన్డీఏయేతర భేటీలో నిర్ణయం

హాజరైన 21 విపక్ష పార్టీల నేతలు

బీఎస్పీ, ఎస్పీ గైర్హాజరు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని 21 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఎన్డీఏయేతర పార్టీలకు చెందిన అగ్ర నాయకులు సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్‌ అనుబంధ భవనంలో సమావేశమై ఉమ్మడి వ్యూహ రచనపై మంతనాలు జరిపారు. రఫేల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, సీబీఐ, న్యాయ వ్యవస్థలో వెలుగుచూసిన అసాధారణ పరిణామాలు, నోట్లరద్దు ప్రభావాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. బీఎస్పీ, ఎస్పీ మినహా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీ హయాంలో ఆర్బీఐ, సీబీఐ లాంటి సంస్థలపై దాడి జరుగుతోందని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఆరోపించాయి.

రాష్ట్రాల వారీ పొత్తులే నయం..
బీజేపీ వ్యతిరేక ఓట్లను కూటగట్టడానికి రాష్ట్రాల వారీగా పొత్తులు పెట్టుకోవడం మేలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సూచించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ కూడా ఈ ఆలోచనకు మద్దతు పలికినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ క్షణమైనా తమ వైఖరిని మార్చుకునే బీఎస్పీ, ఎస్పీలు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. 80 సీట్లున్న యూపీకి చెందిన ఈ పార్టీలు లేకుండా ఎన్డీయేకు ధీటుగా కూటమి ఏర్పాటుచేయడం అసాధ్యం.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, మాజీ ప్రధాని దేవెగౌడ, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్,  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్‌సీ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా, ఆర్‌జేడీ నుంచి తేజస్వి యాదవ్‌ పాల్గొన్నారు.

వినాశన యత్నాల్ని అడ్డుకుంటాం
ఆర్బీఐ లాంటి సంస్థలను నాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని నిలువరించా లని విపక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడంతో దేశంలో ఆర్థి క అత్యవసర పరిస్థితి ప్రారంభమైందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్‌ ఇలా ఉన్నపళంగా ఎప్పుడూ రాజీనామా చేయలేదని, తాజా పరిణామం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.  ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని పరిరక్షించడానికే విపక్షాలన్నీ చేతులు కలిపాయని, ఈ సమావేశం చారిత్రకమని చంద్రబాబు చెప్పారు.
 

మరిన్ని వార్తలు