విపక్షాల ‘కామన్‌ మినిమమ్‌ ప్రొగ్రామ్‌’!

14 Feb, 2019 04:11 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కలిసి పనిచేసేందుకు పలువిపక్ష పార్టీలు అంగీకరించాయి. ఎన్నికల ముందు పొత్తు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని(కామన్‌ మినిమమ్‌ ప్రొగ్రామ్‌–సీఎంపీ) ఖరారు చేసుకోవాలని నిర్ణయించాయి. ఆప్‌ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోజరిగిన ర్యాలీ అనంతరం విపక్ష నేతలు ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యారు. పరిస్థితుల మేరకు రాష్ట్రాల్లో వేరువేరుగా పోటీ చేయాల్సి వచ్చినా.. జాతీయ స్థాయిలో కలసి పని చేయాలని ఆయా పార్టీలు అంగీకరించాయి. సమావేశంలో ముసాయిదా సీఎంపీని పార్టీల నేతలకు పంపిణీ చేశారు. విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించాల్సిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఈ భేటీకి హాజరుకాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు