మీ సమావేశానికి మేము రాము 

30 Jan, 2019 09:28 IST|Sakshi

హోదాపై అఖిలపక్ష భేటీకి దూరంగా ప్రధాన పార్టీలు

సాక్షి, అమరావతి : ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఉద్యమంపై అఖిలపక్ష సమావేశాలంటూ సీఎం చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలను ప్రధాన రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసి, హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టించిన చంద్రబాబు తీరా ఇప్పుడు ఎన్నికల ముందు అఖిలపక్ష సమావేశాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వివిధ పార్టీల నేతలు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రత్యేక హోదాపై నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి హజరుకాబోమంటూ మంగళవారం పలు పార్టీలు సీఎంకు లేఖలు రాశాయి. గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన కాంగ్రెస్, వామపక్షాలు కూడా భేటీకి దూరం జరగడం గమనార్హం. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ సమావేశంతో ప్రయోజనం లేదు: కాంగ్రెస్‌
కేవలం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంటూ హడావిడి చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని, దీంతో బుధవారం జరిగే సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ ఒక లేఖ విడుదల చేశారు. 

రాజకీయ లబ్ధి కోసమే: జనసేన
అఖిలపక్ష సమావేశం అజెండా వివరాలు ఏమీ చెప్పకుండా మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడంపై జనసేన పార్టీ ఆక్షేపించింది. ఇది కేవలం మొక్కుబడి సమావేశంగా ఉందని, రాజకీయ లబ్ధి కోసం ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోందని పవన్‌కల్యాణ్‌ మంగళవారం ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసే వారితో కలిసి పనిచేయడానికి జనసేన  సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

కేసులు పెట్టి ఇప్పుడు సమావేశాలా?
నాలుగున్నర ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడతున్న తమపై కేసులు పెట్టి ఇప్పుడు అఖిలపక్ష సమావేశాలకు ముఖ్యమంత్రి ఏ విధంగా పిలుస్తారని వామపక్షాలు మండిపడ్డాయి. గతంలో తాము ఉద్యమిస్తుంటే విమర్శలు గుప్పించిన అధికారపక్షం ఇప్పుడు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేమంటూ సీపీఎం, సీపీఐ పార్టీలు సీఎంకి లేఖ రాశాయి.

మరిన్ని వార్తలు