ప్రధాని గైర్హాజరుపై విపక్షాల ఫైర్‌

27 Feb, 2019 18:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాక్‌-భారత్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజా పరిస్థితిపై చర్చించేందుకు భేటీ అయిన విపక్షాల సమావేశం ముగిసింది. పార్లమెంట్‌ లైబ్రరీహాల్‌లో జరిగిన ఈ సమావేశంలో 21 ఎన్డీయేతర పార్టీల నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విపక్ష నేతలు మాట్లాడుతూ.. దేశ సైనికులకు అండగా ఉంటామని  అన్నారు. పుల్వామా దాడిని ఖండించి, అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. మంగళవారం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వారిని మట్టుబెట్టిన సైనికులకు అభినందనలు తెలిపారు. సైనికుల త్యాగాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ముక్తకంఠంతో ఖండించారు.

వాయుసేన దాడి అనంతరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. పీఓకేలో భారత వైమానిక దళాల దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ బలగాలకు పట్టుబడిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విపక్షాలు.. పైలెట్‌ క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, శరద్‌ పవార్‌, ఇతర పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు