ఆర్థిక మాంద్యమంటూనే అన్ని కోట్ల ప్రతిపాదనలెలా...?

13 Mar, 2020 03:28 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో సమతుల్యత లోపించిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. ఆర్థిక మాంద్యం ఉందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తక్కువగా ఉంటాయని పేర్కొంటూనే రూ.1.83 లక్షల కోట్ల బడ్జెట్‌ ఎలా ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. రూ.30 వేల కోట్లకు పైగా ఉన్న ద్రవ్యలోటును ఎలా పూడుస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ప్రజలపై ఆస్తిపన్ను, ఇతర చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతోందని అన్నారు. 

ఇద్దరూ కలిసి వెళ్లండి.. 
కాళేశ్వరం ద్వారా భూపాల జిల్లాకు నీళ్లివ్వాలని శ్రీధర్‌బాబు కోరడంతో గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. తన నియోజకవర్గానికి నీళ్లిచ్చే అంశమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తి సానుకూలంగా ఉన్నారని, కాళేశ్వరంతో రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని అన్నారు. అందుకే ఆ ప్రాజెక్టు సందర్శనకు రావాలని కాంగ్రెస్‌ నేతలను తాను కోరానన్నారు. దీనిపై శ్రీధర్‌బాబు మట్లాడే ప్రయత్నం చేయగా, స్పీకర్‌ మైక్‌ ఇవ్వలేదు. అయినా శ్రీధర్‌బాబు నిల్చుని ఉండటంతో ‘మీరూ, గండ్ర వెంకటరమణ ఇద్దరూ కలిసి కాళేశ్వరం వెళ్లిరండి. ప్రాజెక్టు చూసిరండి’అనడంతో అంతా నవ్వుకున్నారు.  

కేంద్ర సాయం అందకపోతే చలో ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ 
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కరెంట్, రైల్వేలు, 11 సాగునీటి ప్రాజెక్టులు, పింఛన్లు, గృహ నిర్మాణాలకు కేంద్రం నిధులిస్తోందన్నారు. కేంద్రంనుంచి ఒకవేళ రాష్ట్రానికి అందాల్సిన సాయం అందకపోతే అంతా కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం చేద్దామని పేర్కొన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా