సైనికుల త్యాగాలతో నిస్సిగ్గు రాజకీయాలా?

28 Feb, 2019 02:42 IST|Sakshi

అధికార పార్టీపై ప్రతిపక్షం మండిపాటు

సమావేశానికి హాజరైన 21 పార్టీల నేతలు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సైనిక బలగాల త్యాగాలను ప్రభుత్వం నిస్సిగ్గుగా రాజకీయం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతకు సంబంధించి చర్యలపై ప్రభుత్వం అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. బుధవారం పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో సమావేశమైన 21 ప్రతిపక్ష పార్టీల నేతలు పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై జరిగిన దాడిని ఖండించారు. ఈ ఘటనలో నేలకొరిగిన జవాన్లకు నివాళులర్పించారు. ఇందుకు ప్రతిగా పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్‌ జరిపిన దాడులపై హర్షం ప్రకటించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మీడియా సమావేశంలో చదివి వినిపించారు.

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దళం దాడులపై హర్షం వ్యక్తం చేసిన ప్రతిపక్షనేతలు..పాక్‌ దుస్సాహసాన్ని ఖండించారు. పాక్‌ సైన్యానికి పట్టుబడిన వింగ్‌ కమాండర్‌ భద్రతపై ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘సైనిక బలగాల త్యాగాలను అధికార పార్టీ(బీజేపీ) నిస్సిగ్గుగా రాజకీయం చేయడం ఘోరమైన విషయం. దేశ భద్రత రాజకీయ ప్రయోజనాలకు అతీతమైంది. ఐఏఎఫ్‌ దాడి అనంతరం అఖిలపక్ష సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించకపోవడం విచారకరం’అని పేర్కొన్నారు.

ఈ భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులామ్‌ నబీ ఆజాద్, అహ్మద్‌ పటేల్, శరద్‌ పవార్‌ (ఎన్‌సీపీ), చంద్రబాబు నాయుడు(టీడీపీ), మమతా బెనర్జీ (టీఎంసీ), శరద్‌ యాదవ్‌(ఎల్‌జేడీ), టి.శివ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), సతీశ్‌ చంద్ర మిశ్రా (బీఎస్‌పీ), మనోజ్‌ ఝా (ఆర్జేడీ), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), సుధాకర్‌రెడ్డి (సీపీఐ), డానిష్‌ అలీ (జేడీఎస్‌), అశోక్‌ కుమార్‌ సింగ్‌ (జేవీఎం), శిబూ సోరేన్‌ (జేఎంఎం), ఉపేంద్ర కుష్వాహా (ఆర్‌ఎల్‌ఎస్‌పీ), జితిన్‌ రామ్‌ మాం ఝి (హెచ్‌ఏఎం), కోదండరాం (టీజేఎస్‌) తది తరులు పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, నేష నల్‌ కాన్ఫరెన్స్‌ తరఫున నేతలెవరూ రాలేదు.

మరిన్ని వార్తలు