నా యుద్ధం ఉగ్రవాదంపై... విపక్షాల దాడి నాపై

6 Mar, 2019 04:20 IST|Sakshi
మధ్యప్రదేశ్‌లోని ధర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారులతో ముచ్చటిస్తున్న మోదీ

విపక్ష నేతల వ్యాఖ్యలపై ప్రధాని

తీరు మారకుంటే ఏమవుతుందో పాక్‌కు తెలుసు

గుజరాత్, మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌/అదాలజ్‌/ధర్‌: పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలని తాను యుద్ధం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం ప్రధాని గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు (ప్రతిపక్షాలు) నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పేదరికంపై నేను పోరాడుతుండగా వాళ్లు చౌకీదార్‌ను తొలగించేందుకు చూస్తున్నారు. నిజాయతీపరుడైన ఈ చౌకీదార్‌తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లు మోదీ హఠావో అంటూ అరుస్తున్నారు’ అని చెప్పారు.

పాక్‌కు బుద్ధి చెప్పాం
పాక్‌లోకి ప్రవేశించి ఉగ్రశిబిరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగ్గిన బుద్ధి చెప్పామని ప్రధాని అన్నారు. ‘పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాం. తీరు మారకుంటే తలెత్తే పరిణామాలేమిటో పాక్‌కు ముందే చెప్పాం’ అని అన్నారు. కానీ, ఎయిర్‌స్ట్రైక్‌ పాక్‌పై జరిగినా భారత్‌లో ఉన్న కొందరికి ఆ దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. ‘పుల్వామాకు ప్రతీకారంగా మనం చేసిన దాడిని ప్రపంచమంతా మద్దతు పలుకుతుండగా అత్యంత కల్తీ కూటమి(ప్రతిపక్ష మహాకూటమి) నేతలు మాత్రం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు.  

రాహుల్‌ ‘ఆకలి బాధ’ వ్యాఖ్యలపై..
ఒక్క పూట కూడా ఖాళీ కడుపుతో నిద్రించని వారు మాత్రమే ఆకలి బాధ మానసికమైందని అంటారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘పేదరికం పేరుతో ఓట్లు దండుకుని దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన వీళ్లకు పేదరికం అనేది కేవలం మానసిక భావన’ అని  2013లో రాహుల్‌ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు.

అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నారు
‘ప్రభుత్వమే ప్రతీ పనినీ చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఫలానా పనిని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కొత్త ఒరవడి’ అని అన్నారు.  
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు