దోపిడీని ఆపినందుకే మహాకూటమి

20 Jan, 2019 04:11 IST|Sakshi
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా యుద్ధట్యాంకుపై కూర్చున్న ప్రధాని మోదీ

విపక్ష నేతల సభపై ప్రధాని మోదీ వ్యాఖ్య

హజీరాలో యుద్ధ ట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభించిన మోదీ

సిల్వస్సా/గాంధీనగర్‌/ముంబై: దేశాన్ని దోచుకోకుండా ఆపినందుకే ప్రతిపక్షాలన్నీ ఏకమై ‘మహాకూటమి’గా ఏర్పడ్డాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమి దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి అని మండిపడ్డారు. కోల్‌కతాలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన విపక్షనేతలపై పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్‌ హవేలీ రాజధాని సిల్వస్సాలో శనివారం ప్రధాని మోదీ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు.

‘ప్రజాధనం దోపిడీకి, అవినీతిని అడ్డుకునేందుకు నేను తీసుకున్న చర్యలపై కొందరికి కోపం వచ్చింది. భయంతో వారంతా ఒక్కటయ్యారు’ అని మండిపడ్డారు. ‘మా పార్టీకి ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది. దీంతో రక్షించండంటూ ఆ పార్టీ నేతలు కేకలు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను చంపేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగకుండా టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.

యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం
ప్రైవేట్‌ రంగంలో దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌లోని హజీరాలో ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ఏర్పాటు చేసిన కే9 వజ్ర–హొవిట్జర్‌ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు.  2017లో కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన రూ.4,500 కోట్ల ఒప్పందం ప్రకారం ఎల్‌ అండ్‌ టీ సంస్థ 42 నెలల్లో 100 కే9 యుద్ధట్యాంకులను అందించాల్సి ఉంది. ఇప్పటికే 10 ట్యాంకులను సైన్యానికి అందించింది. వీటి తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఆ సంస్థ దక్షిణ కొరియా హన్వ్‌హా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, 50 టన్నుల బరువుండే కే9 ట్యాంకు 47 కేజీల బరువైన బాంబును 43 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలపైకి పేల్చగలదు.

మాతృమూర్తితో ప్రధాని
ప్రధాని మోదీ శనివారం ఉదయం తన తల్లి హిరాబా(90)ను కలుసుకున్నారు. రైసన్‌ గ్రామంలో సోదరుడు పంకజ్‌ ఇంట్లో ఉంటున్న మాతృమూర్తితోపాటు ఇతర కుటుంబసభ్యులతో మోదీ ముచ్చటించారు.

సినిమా మాదిరిగా దేశమూ మారుతోంది
భారతీయ సినిమా ఇతివృత్తం కాలానుగుణంగా మారుతోందని మోదీ అన్నారు. ముంబైలో ‘నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ ప్రారంభించిన అనంతరం పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరైన సభనుద్దేశించి మాట్లాడారు. ‘సినిమాలు, సమాజం పరస్పర ప్రతిబింబాలు. గతంలో పేదరికం, అసహాయతనే ఎక్కువగా చూపేవారు. నేడు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలనూ చూపుతున్నారు. లక్షల్లో సమస్యలుంటే కోట్లాది పరిష్కారాలు చూపుతున్నారు’ అని అన్నారు. ఈ మ్యూజియంలో రెండో ప్రపంచ యుద్ధంలో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టే 30 గంటల నిడివి గల డిజిటైజ్డ్‌ ఫుటేజీ ఉందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు