విపక్షాల టార్గెట్‌.. టీఆర్‌ఎస్‌!

17 Jan, 2020 08:38 IST|Sakshi

మున్సిపల్‌ ఎన్నికల్లో హోరాహోరీ

వార్డుల్లో జోరుగా ప్రచారం

రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు

మరో నాలుగు రోజులే మిగిలి ఉండడంత జోరు పెంచిన పార్టీలు 

సాక్షి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్‌వైపే గురిపెట్టాయి. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. ప్రతిగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం తదితర రాజకీయ పార్టీలూ పోటీ చేసిన చోటల్లా విజయం సాధించేందుకు ఉపాయాలు పన్నుతున్నాయి. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 162 వార్డులకు గాను ప్రస్తుతం 161 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని వార్డుల్లో పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఒక్కోచోట ఒక్కో పార్టీతో గట్టిపోటీ ఉంది.

కాంగ్రెస్‌ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ పడుతుండగా, ఆ తర్వాత బీజేపీ సైతం కొన్ని మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో, మరికొన్ని చోట్ల పాక్షికంగా బరిలో నిలిచింది. సీపీఎం తనకు బలమున్నవిగా భావిస్తున్న చోటల్లా పోటీలో ఉంది. నందికొండ మున్సిపాలిటీలో మినహా సీపీఎం ఆరు చోట్ల తన అభ్యర్థులను బరిలోకి దించింది. మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం, ప్రచార అంశాలను పరిశీలిస్తే... టీఆర్‌ఎస్‌ ఒక వైపు విపక్షాలన్నీ మరొక వైపు అన్నట్టుగా సాగుతోంది.

ప్రభుత్వం అనుసర్తిస్తున్న వి«ధానాలు, స్థానిక సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ప్రధాన ఎజెండాగా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ మాత్రం అన్ని చోట్లా అభివృద్ధి మంత్రాన్నే జపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున, స్థానికంగా కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని, తమ వద్ద ఉన్న ప్రణాళికలను వివరిస్తున్నారు. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండడడంతో సాధ్యమైనంత వరకు వార్డుల్లోని ప్రతి ఇంటినీ, ప్రతి ఓటరును కలిసేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూనే.. టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.

జోరందుకున్న ప్రచారం
ఆయా వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల ఉప సంహరణల తర్వాత సంక్రాంతి పండుగ రావడంతో ఒక రోజు కొంత విరామం ఇచ్చినా, గురువారం కనుమ పండుగ ఉన్నా.. ఆయా పార్టీల అభ్యర్థులు తమ నేతలను తీసుకువచ్చి ప్రచారం చేసుకున్నారు. జిల్లా కేంద్రం నల్లగొండలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పోటా పోటీగా ప్రచారం చేశాయి. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి పార్టీ సీనియర్‌ నేతలంతా కలిసి పానగల్‌ నుంచి (ఒకటో వార్డు) ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నా.. పార్టీ తరపున సీనియర్‌ నాయకులంతా రంగంలోకి దిగారు. మున్సిపాలిటీల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యేలపైనే పెట్టినందున.. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ప్రచారంలోకి అడుగు పెట్టారు. నాలుగు రోజుల పాటు షెడ్యూలు తయారు చేసుకుని వార్డుల వారీగా పర్యటించనున్నారు.

మరో వైపు కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో గురువారం ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఒకటీ రెండు సార్లు మినహా.. అత్యధిక పర్యాయాలు నల్లగొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహించింది. జిల్లా కేంద్ర మున్సిపాలిటీ కావడంతో ఆ పార్టీ తిరిగి తమ సిట్టింగ్‌ మున్సిపాలిటీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే గత పాలకవర్గంలో వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన బుర్రి శ్రీనివాస్‌ రెడ్డిని చైర్మన్‌ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించి పార్టీ అభ్యర్థుల్లో ఊపు తెచ్చే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే కోమటిరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారని చెబుతున్నారు. 

ఇంకోవైపు బీజేపీ సైతం ఈసారి మున్సిపల్‌ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లా మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో 161 వార్డుల ఎ న్నికకు గాను బీజేపీ 127 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టింది. నల్లగొండలో 48 వార్డులకు గాను 45 వార్డుల్లో పోటీ చేస్తోంది. జిల్లా కేంద్రాన్ని కీలకంగా భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం ప్రచారానికి బయటి నేతలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. గురువారం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రచారానికి వచ్చారు. రోడ్‌షోకు పోలీసుల అనుమతి లేకపోవడంతో పలు వార్డుల్లో తిరిగి ప్రచారం నిర్వహించారు.   

మరిన్ని వార్తలు