సీఎం అయ్యేందుకు పన్నీర్‌సెల్వం కుట్ర

6 Oct, 2018 03:46 IST|Sakshi

ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) నేత, ఆర్కే నగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామిని పదవి నుంచి తప్పించేందుకు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.  చెన్నైలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతేడాది జూలై 12న ఓ మిత్రుడి చొరవతో తనను పన్నీర్‌సెల్వం కలుసుకున్నారని దినకరన్‌ తెలిపారు. ఈ సందర్భంగా తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రతిపాదించారని వెల్లడించారు.

‘ఇద్దరం కలిసి పళనిస్వామిని అధికారం నుంచి దించేద్దాం’ అని తనతో చెప్పారన్నారు. కేవలం పళనిస్వామిని తప్పించి సీఎం పీఠం ఎక్కాలన్న అత్యాశతో పన్నీర్‌సెల్వం తనను కలిశారని విమర్శించారు. గత నెలలో మరోసారి తనను కలిసేందుకు పన్నీర్‌సెల్వం యత్నించగా, తాను అంగీకరించలేదని చెప్పారు. 2017లో జరిగిన సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న  శశికళపై తిరుగుబాటు చేసినందుకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పన్నీర్‌సెల్వం తనను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాలను బయటపెట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయమై పన్నీర్‌సెల్వంను మీడియా ప్రశ్నించగా..‘అదంతా గడిచిపోయిన కథ‘ అంటూ క్లుప్తంగా జవాబిచ్చారు.

రాష్ట్రాభివృద్ధి కోసమే ఏకమయ్యాం..
రాష్ట్రాభివృద్ధి కోసమే పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమయ్యాయని మంత్రి తంగమణి అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వీలుకాకపోవడంతో ప్రజలు, పార్టీలో గందరగోళం సృష్టించేందుకు దినకరన్‌ కొత్త నాటకాలు మొదలెట్టాడని ఆరోపించారు. 18 మంది దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులో విజయం సాధిస్తామని అన్నాడీఎంకే నేత మురుగవేల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు