ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు.. ఒవైసీ అడ్డుపుల్ల

28 Dec, 2017 11:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్‌ తలాక్‌ సవరణ బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానుంది. అయితే ఇది విరుద్ధమంటూ మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉదయం ఓ నోటీసును అందించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు 72వ నిబంధన ప్రకారం నోటీసు అందజేసినట్లు ఆయన తన ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే దానిపై చర్చకు అంగీకరిస్తారా? అన్నది చూడాలి.  ‘‘ముస్లిం మహిళలను రక్షించేందుకు రూపొందించిన బిల్లు అని కేంద్రం చెబుతోంది. తద్వారా ముస్లింలను దోషిగా చూపించి రెచ్చగొట్టే విధంగా కేంద్రం చేష్టలు ఉన్నాయని స్పష్టమౌతోంది’’ అని ఆయన చెబుతున్నారు.

కావాలంటే ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డుతో సంప్రదించి, వారి సూచనల ప్రకారం చట్టాన్ని రూపొందించాలని అసదుద్దీన్‌ గతంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ఓ లేఖ రాశారు.

ఇక ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు నేపథ్యంలో లోక్‌సభకు ఇవాళ, రేపు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ అయ్యింది. ముస్లిం మహిళా (వివాహ రక్షణ హక్కులు) బిల్లు-2017కు హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. ఇంకోపక్క బిల్లును రూపొందించడంలో సరైన పద్ధతిని అవలంబించలేదని కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు