బీజేపీ అర్థసత్యాలే మాట్లాడుతోంది: చిదంబరం

27 Jun, 2020 15:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్ర‌ధాని స‌హాయ నిధి నుంచి యూపీఏ హ‌యాంలో రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌(ఆర్‌జీఎఫ్‌)కు నిధులు మ‌ళ్లించిన‌ట్లు బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు చిదంబ‌రం స్పందిచారు. బీజేపీ అన్నీ అర్థ స‌త్యాలే మాట్లాడుతుందని ఆయ‌న ఆరోపించారు. ఈ క్రమంలో చిదంబరం మాట్లాడుతూ.. ‘బీజేపీ ఆరోపణల మేరకు కాంగ్రెస్‌ రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు ఇచ్చిన రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చేస్తుంది. అలానే బీజేపీ చైనా ఆక్రమణలను తొలగించి.. సరిహద్దులో యథాతథ స్థితిని తిరిగి తీసుకురాగలమని దేశ ప్రజలకు హామీ ఇవ్వగలదా’ అని ప్రశ్నించారు. (రాజీవ్‌ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు)

2005లో మ‌న్మోహ‌న్ సింగ్‌ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్‌జీఎఫ్‌కు 20 ల‌క్ష‌లు బ‌దిలీ చేశారు. దీన్ని న‌డ్డా త‌ప్పుప‌ట్ట‌డాన్ని చిదంబ‌రం వ్య‌తిరేకించారు. ఆ డ‌బ్బును సునామీతో దెబ్బ‌తిన్న అండ‌మాన్ దీవుల్లో ఖ‌ర్చు చేసిన‌ట్లు చిదంబరం వెల్ల‌డించారు. ప్రస్తుతం బీజేపీ ‘భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు’ అంశంపై ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు వాస్తవికతకు అనుగుణంగా సమాధానం ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చిదంబరం కోరారు. 

అంతేకాక ఆర్‌జీఎఫ్ నిధుల‌కు, చైనా ఆక్ర‌మ‌ణ‌కు ఏం సంబంధం ఉంద‌ని చిదంబ‌రం ప్రశ్నించారు. ఒక‌వేళ ఆ డ‌బ్బును ఇప్పుడు తిరిగిస్తే, తాజాగా చైనా ఆక్ర‌మించిన భూభాగాన్ని ప్ర‌ధాని మోదీ తీసుకురాగ‌ల‌రా అని ఆయన బీజేపీని ప్ర‌శ్నించారు. ఆర్‌జీఎఫ్‌కు విరాళాలు ఇస్తున్న చైనా ఎంబసీ ఒక‌ర‌కంగా కాంగ్రెస్ పార్టీకి స‌హ‌కరిస్తున్నట్లే అని బీజేపీ ఆరోపించింది. చైనా సంక్షోభం నుంచి దారి మ‌ళ్లించేందుకు బీజేపీ ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు చిదంబ‌రం మండిపడ్డారు

మరిన్ని వార్తలు