లోక్‌సభతోపాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు

4 Dec, 2018 04:14 IST|Sakshi

ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లకూ అప్పుడే: ఈసీ వర్గాలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలాలు 2019 మే, జూన్‌ నెలల్లో ముగియనున్నాయి. వీటితో పాటే ఇటీవల అసెంబ్లీ రద్దయిన జమ్మూ కశ్మీర్‌లోనూ ఎన్నికలు జరిపే అవకాశాల్ని కొట్టిపారేయలేమని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ రద్దు కావడంతో జమ్మూ కశ్మీర్‌లో ఆరు నెలల్లోపు అంటే మే నాటికి ఎన్నికలు జరగాలి.

అక్కడ లోక్‌సభతో పాటు లేదా అంతకుముందే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని ఈసీ అధికారి ఒకరు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాల్ని మోహరిస్తారు కాబట్టి అప్పుడే అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించడం ఈసీకి సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్ని కూడా వీటితో పాటే నిర్వహిస్తారా? అని ప్రశ్నించగా.. ఒకవేళ ఆ 2 రాష్ట్రాల్లో షెడ్యూల్‌కు ఆరు నెలల ముందే అసెంబ్లీలు రద్దయితే, అక్కడా లోక్‌సభ ఎన్నికలతో పాటే నిర్వహిస్తామని చెప్పారు. అదే జరిగితే 2019లో మరే ఇతర ఎన్నికలు ఉండవని తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీల పదవీ కాలాలు 2019 నవంబర్‌లో ముగియనున్నాయి.

మరిన్ని వార్తలు