129వ రోజు పాదయాత్ర డైరీ

6 Apr, 2018 02:54 IST|Sakshi

05–04–2018, గురువారం
శేకూరు క్రాస్, గుంటూరు జిల్లా

దళితులను కించపరచడం నిజం కాదా బాబూ?


ఉన్నత శిఖరాలను తాకే ఆశయాలు.. మహోన్నత స్థితికి చేర్చే ఆదర్శాలు.. విశ్వసనీయతకే అర్థం చెప్పే కార్యదక్షతలోంచే జన నేత పుట్టుకొస్తాడని బాబూ జగ్జీవన్‌రామ్‌ రుజువుచేశారు. పేదరికంలో పుట్టి.. కష్టాల మైలు రాళ్లెన్నింటినో దాటొచ్చిన బాబూజీ.. తాడిత పీడిత జనావళి కోసం జీవితాన్ని అర్పించారు. పాదయాత్రలోనే ఆ మహనీయుని జయంతి జరుపుకోవడం ఓ గొప్ప కార్యక్రమంగా భావించాను. ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్నప్పుడు.. బడుగుల కోసం అడుగులేసిన ఆయన నిస్వార్థ సేవలు గుర్తుకొచ్చాయి. ఇదే క్రమంలో అలాంటి ఉత్తమ ఆశయాలను స్వార్థ రాజకీయాలు చిదిమేస్తున్న తీరు బాధించింది.

పాదయాత్రలో అడుగడుగునా దళితులు, పేదల కష్టాలు చూశాను. వాళ్లపై జరుగుతున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు నా దృష్టికొచ్చాయి. బాబూజీ జయంతినీ స్వార్థ రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు.. గుండెల మీద చెయ్యేసుకుని ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది. బాబూజీ ప్రతీ జయంతి నాడు దళితులకు ఏదో చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటాడు. మాటల గారడీ చేస్తాడు. ఇది నిజంగా బాధాకరం.

అసలు దళితుల పట్ల, పేదల పట్ల చంద్రబాబుకు ఇసుమంతైనా ప్రేమ ఉందా? ఉంటే.. ‘దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అంటూ వ్యాఖ్యానించేవాడా? తన మంత్రివర్గ సహచరుడే దళితులను అవమానకరంగా దూషిస్తుంటే.. చూసీచూడనట్లు మిన్నకుండిపోతాడా? దళితుల భూములు లాక్కుని వారిని రోడ్డున పడేస్తాడా? అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. బాబు మనుషులు దౌర్జన్యాలు చేస్తారా? దళిత మహిళలను వివస్త్రల్ని చేసి అవమానిస్తారా? సిగ పట్టుకుని ఈడ్చుకొచ్చే దుశ్శాసన పాలన సాగిస్తారా? ఇవన్నీ నేనడిగే ప్రశ్నలు కాదు.. దగాపడ్డ ప్రతి దళిత బిడ్డ ఆక్రోశం, ఆవేదనల గుండె చప్పుళ్లు!

‘చంద్రబాబు పాలనలో ఉన్నజాబూ ఊడేట్టుందన్నా..’ అని నన్ను కలిసిన కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వెలిబుచ్చారు. నాగార్జున యూనివర్సిటీకి చెందిన గిరిధర్, శ్రీనివాసరావు, రవిశంకర్‌ చెప్పిన మాటలు విన్నాక.. చంద్రబాబు అన్యాయాలు ఏ స్థాయిలో పరాకాష్టకు చేరాయో అర్థమవుతోంది. వాళ్లంతా ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేశారు. నాన్నగారి హయాంలో యూజీసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం వాళ్లను నియమించారు.

పదేళ్లుగా పనిచేస్తున్న వారిపై చంద్రబాబు సర్కారు కక్షగట్టినట్టు వ్యవహరిస్తోంది. ‘ఇప్పుడున్న వాళ్లను పీకేసి.. తన పార్టీ వాళ్లను లంచాలు తీసుకుని నియమించుకునే కుట్ర చేస్తున్నారన్నా..’ అని భవిష్యత్తుపై వారు ఆందోళన వెలిబుచ్చారు.‘స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాయమంటున్నారన్నా.. దేశంలో ఈ పరిస్థితి మరెక్కడా లేదన్నా’ అని చెప్పారు. ‘ఇప్పటికే మాకు వయోపరిమితి దాటిపోయింది. ఉద్యోగాల్లోంచి తొలగిస్తే రోడ్డున పడతాం’ అని బాధగా చెప్పారు.

సర్కారు దుర్మార్గంపై కోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోకుండా ఈ నెల 9న స్క్రీనింగ్‌ టెస్ట్‌ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబొస్తేనే జాబొస్తుందని ఎన్నికల ముందు చెప్పి.. ఇప్పుడు ఇలా చేయడం దారుణం.. అన్యాయం. బాబు మోసాలు గ్రహించిన యువతలో ఆవేశం కట్టలు తెంచుకోవడం గమనించాను. వారి కోపాగ్ని జ్వాలలు, చంద్రబాబు పాపాలను దహించేందుకు చుట్టుముడుతున్నాయనిపించింది. పాలకుల పాపాలు పండాయి. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తప్పకుండా మంచి రోజులొస్తాయని వారిలో గుండె ధైర్యం నింపాను.

‘అమెరికా వెళ్లడం.. ఇంత పెద్ద ఉద్యోగం చేస్తుండటం.. ఇప్పటికీ కలగానే ఉంది. ఇదంతా మీ నాన్నగారి ప్రోత్సాహమే. నేనేకాదు.. నాలాంటి వారినెందరినో వెన్ను తట్టి ప్రోత్సహించిన గ్రేట్‌ సార్‌.. వైఎస్సార్‌ గారు’ అని అమెరికాలో ఉన్న చెల్లెమ్మ సౌమ్య.. తన తండ్రి ద్వారా పాదయాత్రలో ఉన్న నాకో సందేశం పంపింది. ‘కుళ్లిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మీరు సింహంలా పోరాడుతున్నారు. అందుకే మా చిట్టి తల్లి సింహం బొమ్మ ఇవ్వమందయ్యా’ అంటూ సౌమ్య తండ్రి నాకు సింహం బొమ్మను అందించాడు.

నాన్నగారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఏపీలోనే బీటెక్‌ పూర్తి చేసిన ఆ చెల్లి.. అమెరికా వెళ్లి ఎంఎస్‌ చేసిందట. అక్కడే మంచి ఉద్యోగం చేస్తోందట. నాన్నగారి ప్రతి సంక్షేమ పథకాన్నీ మెచ్చుకోవడమే కాదు.. ఉచిత విద్యుత్‌ పథకానికి తన చిన్నప్పుడే కిడ్డీ బ్యాంకులో డబ్బులిచ్చి మద్దతు తెలిపిందట. పాదయాత్రను రోజూ నెట్‌ ద్వారా గమనిస్తోందని, పేదల కోసం చేపట్టిన సంకల్పం సిద్ధించాలని తన మాటగా.. తండ్రి ద్వారా కబురు పెట్టడం సంతోషం కలిగించింది.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. షెడ్యూల్‌ కులాల సంక్షేమమే మా ప్రాధాన్యమంటూ గత ఎన్నికల ప్రణాళిలో మీరు ఘనంగా రాసుకున్నారు. ఆచరణలో మాత్రం గతంలో ఎన్నడూ లేనంతగా మీ పాలనలోనే వారిపై దాడులు, వారికిచ్చిన భూములపైనే డేగల్లా వాలి కబళించడాలు జరుగుతున్నాయి. అది నేరం కాదా? దళితులను కించపరిచేలా మీరు, మీ మంత్రివర్గ సహచరుడు మాట్లాడటం దురహంకారానికి పరాకాష్ట కాదా?

మరిన్ని వార్తలు