ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే యాత్ర

5 Nov, 2017 01:39 IST|Sakshi
డీజీపీతో సమావేశమైన వైఎస్సార్‌సీపీ నేతలు

వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, ఉమ్మారెడ్డి, పార్థసారధి

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను తలపెట్టారని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ నండూరి సాంబశివరావును వైఎస్సార్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారధి తదితరులు శనివారం కలిశారు.

డీజీపీతో సమావేశమైన వారు ఈ నెల 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి జగన్‌ చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్ర వివరాలను అందజేశారు. భేటీ అనంతరం మీడియాతో బొత్స మాట్లాడుతూ... వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు సంబంధించి తాము చెప్పిన వివరాలకు డీజీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు.  ప్రజా సంకల్ప యాత్రపై టీడీపీ సర్కార్‌ కుట్రలు పన్నుతోందని మరో సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్‌కు ప్రస్తుతం ఉన్న జడ్‌ కేటగిరి భద్రతను యాత్ర పొడవునా కొనసాగించాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. డీజీపీని కలిసినవారిలో కొలుసు పార్థసారథి, జోగి రమేష్‌ తదితరులున్నారు. 

జగన్‌ యాత్రకు అనుమతి: డీజీపీ వెల్లడి
రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన యాత్రకు అను మతి ఇస్తున్నట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ... 2009 సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌కు లోబడి పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు