ఎన్నికల ఫలితాలపై నవాజ్‌ షరీఫ్‌ స‍్పందన

27 Jul, 2018 15:01 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత‍్వంలోని ‘పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌’ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ స్పందించారు. ప్రస్తుతం అడియాలా జైల్లో ఉన్న నవాజ్‌ షరీఫ్‌.. పాకిస్తాన్‌ ఎన్నికలు దొంగిలించి బడ్డాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మలినమైన ఫలితాల్ని చూడాల్సి వచ‍్చిందన్నారు. తాజా పాకిస్తాన్‌ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో చెడు సంకేతాలకు నిదర్శమన్నారు. అడియాలా జైల్లో నవాజ్‌ షరీఫ్‌ను పరామర్శించడానికి  వచ్చిన అభిమానులతో ముచ్చటించిన ఆయన ఎన్నికలు జరిగిన తీరును మొదలుకొని, ఫలితాల వరకూ తనదైన విశ్లేషించారు. అసలు ఎన్నికలే సరిగా జరగలేదన్న షరీఫ్‌.. ఫైసలాబాద్‌, లాహోర్‌,  రావల్పిండిల్లో తమ అభ్యర్థులు అత్యంత నిలకడను ప్రదర్శించినా చివరకు ఓటమితో సరిపెట్టుకోవాల్సి రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరొకవైపు పీటీఐఈ మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్‌ జరిగిందని పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి.

ఇదిలా ఉంచితే, పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్‌ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ 63, బిలావల్‌ భుట్టో(బెనజీర్‌ భుట్టో తనయుడు) పార్టీ పీపీపీ 39, ఇతరులు 50 స్థానాలను కైవసం దక్కించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 137.

చదవండి: పాక్‌ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన

మరిన్ని వార్తలు