‘కాంగ్రెస్‌ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయి’

29 Jan, 2020 18:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయంతో కాంగ్రెస్‌, బీజేపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయని.. రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వరరెడ్డి  అన్నారు. ఈయన బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సాధించిన మెజారిటీ భారతదేశ చరిత్రలో ప్రథమం అన్నారు. 130 సీట్లలో 122 గెలిచామని.. ఓ నాయకుడి మీద అఖండ విశ్వాసం ప్రకటించిన ఎన్నికలు ఇవే అన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సీటు కోల్పోయినా బుద్ధి మార్చుకోలేదని.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పాలక మండలి ఎన్నికపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాజ్యసభ బులెటిన్‌ ప్రకారంకేవీపీ రామచంద్ర రావును ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించారని ఆయన గుర్తు చేశారు.

ఉత్తమ్ ఎన్నికల కమిషన్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి కేవీపీ రామచంద్ర రావు ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా చేర్పించారని అన్నారు. మున్సిపల్ చట్టం రెండో చాప్టర్ ఐదో సెక్షన్‌ను ఉత్తమ్ చదువుకోవాలి హితవు పలికారు. ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు కూడా ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్‌ ఆఫీషియో సభ్యులుగా చేరవచ్చు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల చట్టాలను చదవరని.. వారికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల ఆకారాలు పెరిగాయి కానీ బుద్ది పెరగలేదని.. ఇంకా వలసవాద భావజాలంతోనే ఉన్నారని విమర్శించారు. కావాలంటే కేవీపీని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా చేయండని.. ఎవరు వద్దన్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. చట్ట ప్రకారం నేరేడు చర్లలో టీఆర్‌ఎస్‌ గెలిచిందని.. తమ విజయాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్, బీజేపీ నేతలకు తగదన్నారు. బీజేపీ లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని.. బీజేపీని ప్రజలు తిరస్కరించినా ఆయన తీరు మారటంలేదని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు.

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డివీధి భాగోతాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వ్యవస్థలను తప్పుబడుతున్న ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని సుమన్‌ డిమాండ్‌ చేశారు. పీసీసీ పదవిని కాపాడుకునేందుకు ఉత్తమ్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌కే ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందీ పోయి గావు కేకలు పెడుతున్నారని అన్నారు. ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా బ్యాలట్తో ఎన్నికలు జరిగినా విజయం టీఆర్‌ఎస్‌దే అన్నారు.

గాలివాటంతో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలిచిందని ఆయన విమర్శించారు. లక్ష్మణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిపాజిట్ కోల్పాయారని సుమన్‌ ఎద్దేవా చేశారు. పదవి పోతుందనే లక్ష్మణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమను ఎంత తిట్టినా లక్ష్మణ్ పదవి పోవడం ఖాయమన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి, లక్ష్మణ్‌లు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లపై వాడిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో వచ్చే తీర్పే అంతిమమని ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ నేతలు మారాలని హితవు పలికారు. ఇక పరిపాలన, పురపాలనపైనే దృష్టి సారించి.. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల మాదిరిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సుమన్‌ తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు