‘ఆర్మీ తెగువను మోదీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు’

27 Feb, 2019 11:15 IST|Sakshi

సర్జికల్‌ స్ట్రయిక్‌లు మోదీ చేసినవి కావు

కేంద్ర మాజీ రక్షణమంత్రి పల్లం రాజు తీవ్ర విమర్శలు

సాక్షి, ఏలూరు: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేయడం గర్వకారణమని కేంద్ర మాజీ రక్షణశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఒక విధానంగా పాకిస్థాన్‌ మలుచుకుందని, పాక్‌లోనే కాదు.. మయన్మార్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్‌ దాడులు చేయాలని ఆయన సూచించారు. భారత ప్రతీకార చర్యకు ప్రస్తుతం అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని,  అయితే, ఇది వెంటనే సంతోషించాల్సిన విషయం కాదన్నారు. పాకిస్థాన్‌కు యుద్ధం చేసి గెలిచే అవకాశం లేనందున ఆ దేశం ఉగ్రవాద దాడులు చేసేందుకు తెగబడే ప్రమాదం ఉందని, అందుకు భారత్ సిద్ధంగా ఉండడంతోపాటు అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని సూచించారు.

సర్జికల్ స్ట్రైక్ లు మోదీ చేసినవి కావు...
‘ఈ సర్జికల్ స్ట్రైక్ లు మోదీ చేసినవి కావు. అంతకుముందు జరిగాయి. ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. భారత్ ఆర్మీ తెగువను ప్రచారం కోసం మోదీ వాడుకుంటున్నారు. కశ్మీర్ ప్రజల మద్దతు పోగొట్టుకోవడమే మోదీ ప్రభుత్వం వైఫల్యం. అందుకే పుల్వామా, ఇతర ఉగ్ర దాడులు మితిమీరాయి’ అని పల్లంరాజు వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక భారత ప్రభుత్వానికి కశ్మీర్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ ప్రధాన అంశాన్ని భారత ప్రభుత్వం గుర్తించి, కశ్మీరీల మద్దతు సంపాదించాలని పేర్కొన్నారు. మోదీ అనేక అంశాల్లో విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను ప్రధానంగా మోదీ సర్కారు ఎదుర్కోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.

మరిన్ని వార్తలు